బ్యాంక్ షేర్లు బేర్
► మందకొడిగా ట్రేడింగ్
► 12 పాయింట్ల నష్టంతో 25,839కు సెన్సెక్స్
► 5 పాయింట్ల నష్టంతో 7,861కు నిఫ్టీ
ట్రేడింగ్ మందకొడిగా సాగడంతో గురువారం ఆద్యంతం ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్ చివరకు స్వల్ప నష్టాలతో ముగిసింది. బ్యాంకుల రుణ నాణ్యత క్షీణిస్తోందంటూ ఆర్‌బీఐ నివేదిక వెల్లడించడంతో బ్యాంక్ షేర్లు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 12 పాయింట్లు నష్టపోయి 25,839 పాయింట్లు వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 7,861 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు వచ్చే వారంలో ముగియనుండడం, నేడు (శుక్రవారం) సెలవు కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. సెన్సెక్స్ 159 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. కాగా వరుసగా రెండో వారమూ స్టాక్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్ 319 పాయింట్లు(1.25 శాతం), నిఫ్టీ 99 పాయింట్లు(1.27 శాతం) లాభపడ్డాయి.
బ్యాంకులపై ‘మొండి’ భారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి బ్యాంక్‌ల రుణ వృద్ధి మందగించిందని, మొండి బకాయిలు పెరిగిపోయాయని ఆర్‌బీఐ నివేదిక బుధవారం వెల్లడించడంతో పలు బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. కబుధవారం లిస్టింగ్ రోజున మెరుపులు మెరిపించిన డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ షేర్లు లాభాల జోరును కొనసాగించాయి. డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ షేర్ 9%, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ 10 శాతం చొప్పున పెరిగాయి.
నేడు సెలవు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నేడు స్టాక్ మార్కెట్‌కు సెలవు, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. స్టాక్ మార్కెట్‌లో పాటు ఫారెక్స్, మనీ, కమోడిటీ మార్కెట్లకు కూడా సెలవు.