బ్యాంక్ షేర్లు బేర్...
ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌కు నష్టాలు
ముంబై: ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్ షేర్లు క్షీణించడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. నేడు (మంగళవారం)ఆర్‌బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 46 పాయింట్ల నష్టంతో 24,825 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 7,556 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 24,982 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్ల కారణంగా 25,002 పాయింట్ల ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత 24,789 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది.
వాహన షేర్లకు నష్టాలు: జనవరిలో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి.
బ్యాంక్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి: ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్ షేర్లకు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు 6 శాతం వరకూ పతనమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సెన్సెక్స్‌లో అత్యధికంగా 5.6%క్షీణించి రూ.217కు పడిపోయింది. ఎస్‌బీఐ 3.9 % నష్టపోయి రూ.173 వద్ద ముగిసింది.