మొండిబకాయిల సమస్య ఆందోళనకరం
♦ కేంద్ర మంత్రి జయంత్‌సిన్హా
♦ రుణ నాణ్యతా సమీక్షలు తరచూ జరగాలని సూచన
ముంబై: బ్యాంకింగ్ మొండిబకాయిల సమస్య ఆందోళనకరంగా ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా పేర్కొన్నారు. రుణ నాణ్యతకు సంబంధించిన సమీక్ష (ఏక్యూఆర్)లు ఒక్కసారితో సరిపెట్టకుండా తరచూ జరపాలని సైతం ఆయన సూచించారు. అనుమానాస్పద రుణాలను వెలికితీయడానికి గడచిన డిసెంబర్‌లో ఆర్‌బీఐ రుణ నాణ్యతా సమీక్షలు జరిపింది. ఇందుకు సంబంధించి 130 అకౌంట్లను ఖరారు చేసింది.
కంపెనీలు పనిచేస్తున్నా లేకున్నా... ఏ పరిస్థితుల్లో ఉన్నా సంబంధిత అకౌంట్లు అన్నింటినీ మొండిబకాయిల జాబితాలో చేర్చాలని రెగ్యులేటర్ సూచించింది. దీనితో భారీగా అదనపు ప్రొవిజన్ కేటాయింపులతో బ్యాంకింగ్ రంగం లాభాలు ఒక్కసారిగా భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.70,000 కోట్ల మేర నిధులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ తరహా సమీక్షలు తరచూ చేయాలన్నది తన సూచనని జయంత్ సిన్హా ఇక్కడ మంగళవారం క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఎన్‌పీఏ ఫండ్ ఏర్పాటు కసరత్తు...
సమస్య పరిష్కారంపై సిన్హా మాట్లాడుతూ, మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో ఒక ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుపుతున్నట్లు తెలిపారు.