పెళ్లికి ముందు..ఆ తర్వాత! | Before marriage...after! | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు..ఆ తర్వాత!

Published Mon, Jun 15 2015 2:56 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

పెళ్లికి ముందు..ఆ తర్వాత! - Sakshi

పెళ్లికి ముందు..ఆ తర్వాత!

మహిళలకు ఫైనాన్షియల్ ప్లానింగ్
వివాహం అనేది మహిళల జీవితంలో ఓ కొత్త మలుపు.  జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తారు. కొత్త కుటుంబం ఏర్పడుతుంది. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితులు మారతాయి. వివాహానికి ముందు ఎవరి ఆదాయాలు, ఎవరి ఖర్చులు వారివే. కానీ పెళ్లయ్యాక మరో వ్యక్తి కూడా భాగస్వామి అవుతారు. వారి ఆదాయాలు, ఖర్చులు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. వీటినిబట్టే కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవడం అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల మీద అవగాహన కలిగించేందుకు ఉద్దేశించినదే ఈ కథనం.
 
వివాహానికి ముందు..
ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు ఎప్పుడైనా సరే అన్నింటి కన్నా ముందు బడ్జెట్ అంటూ రూపొందించుకోవాలి. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థమేమీ కాదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం. ప్రతి నెలా వచ్చే ఆదాయానికన్నా ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. గత ఆర్థిక పరిస్థితులు, రాబోయే కాలంలో వచ్చే ఆదాయాలు, తలెత్తే ఖర్చులు మొదలైన వాటి ఆధారంగా బడ్జెట్ తయారు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తం కచ్చితంగా పక్కన పెట్టుకోవాలి.

ఎప్పటికప్పుడు అన్నింటి రేట్లూ పెరిగిపోతున్నాయి కనుక.. ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేసుకోవాలి. నిలకడగా మీ ఖర్చుల కన్నా ఆదాయం ఎక్కువగానే ఉందంటే.. మీరు వేసుకున్న ఆర్థిక ప్రణాళిక పక్కాగానే ఉన్నట్లు లెక్క. అలా గానీ లేదో.. మీరు మరోసారి సరైన ప్లాన్ కోసం మళ్లీ కసరత్తు చేయాల్సిందే. బడ్జెట్ తయారీ తర్వాత చేపట్టాల్సినది.. ఆర్థిక ప్రణాళిక. ఉదాహరణకు విహార యాత్రలు కావొచ్చు, ఇల్లు లేదా కొత్త కారు కొనుక్కోవడం కావొచ్చు.. ఇలాంటి ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఎంతో కొంత పొదుపు చేయాల్సి వస్తుంది.

ఇలాంటివి చూసుకుని మీ ఆర్థిక లక్ష్యాల జాబితాను తయారు చేసుకోండి. ఒక్కో దాన్ని ఇంత సమయంలో సాధించాలని గడువు నిర్దేశించుకోండి. అంటే.. స్వల్పకాలికం, మధ్యకాలికం, దీర్ఘకాలికం అంటూ గడువు పెట్టుకోండి. వీటి ఆధారంగానూ, మీ రిస్కు సామర్థ్యం ఆధారంగానూ (మీరు ఎంత రిస్కు తీసుకోగలరన్నది) మీరు ఎంత మొత్తం, ఏ విధంగా పొదుపు చేయొచ్చన్నది ఆలోచించవచ్చు.

వివాహానికి ముందు పెద్దగా బాధ్యతలు లేకుండా సింగిల్‌గానే ఉంటారు కనుక ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. షేర్లు (నేరుగానైనా లేక మ్యూచువల్ ఫండ్స్ ద్వారానైనా) మీ పోర్ట్‌ఫోలియోలో అధిక భాగం ఉండేలా చూసుకోవచ్చు. మిగతాది డెట్ ఫండ్లు, సుమారు 5-10 శాతం మొత్తం పసిడిలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఒకే సాధనంలో గాకుండా వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్కు ఒక మోస్తరు స్థాయికి పరిమితమవుతుంది. షేర్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ప్రకారం పెట్టుబడి పెట్టడం వల్ల మరీ ఎక్కువ రిస్కు లేకుండా పోర్ట్‌ఫోలియోపై రాబడులు మెరుగ్గా ఉండేలా చూసుకోవచ్చు. అయితే, ఇవన్నీ కూడా కాస్త ఎక్కువ రిస్కు సామర్థ్యం గలవారికీ, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఉపయోగపడేవని గుర్తుంచుకోవాలి.

స్వల్పకాలిక లక్ష్యాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ డిపాజిట్లు, పొదుపు ఖాతాలు, లిక్విడ్ ఫండ్స్ వంటి డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన పక్షంలో ఎదురయ్యే రిస్కుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పించే విధంగా ఉంటాయి.

వీలైనంత వరకూ చిన్న వయసు నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. సాధ్యమైనంత వర కూ రిస్కు తక్కువగా ఉండి అధిక రాబడులు ఇచ్చేందుకు ఆస్కారమున్న సాధనాలను ఎంచుకోవాలి. సిప్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ విధానంలో మార్కెట్ పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ పోవడం వల్ల మార్కెట్ పెరిగినా, తగ్గినా కూడా ప్రయోజనం పొందవచ్చు. ప్రతి నెలా రూ. 1,000 చొప్పున సిప్ పద్ధతిలో 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెడితే రూ. 18 లక్షలు పోగవుతుంది (వార్షికంగా 9 శాతం రాబడి లెక్క వేసుకుంటే). ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్, చక్రవడ్డీ మహిమ.
 
పెళ్లయ్యాక..
వివాహం అనంతరం బడ్జెట్‌ను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇక నుంచి ఇది జాయింట్ బడ్జెట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరి ఆదాయాలు, ఇద్దరి వ్యయాలకు ఇందులో చోటు కల్పించాలి. మొత్తం కుటుంబ ఆదాయాలు, వ్యయాలు అన్నింటినీ ఇందులో లెక్కేసుకోవాలి. మీ ఆదాయాలు, ఖర్చులు, రుణాలు (ఏవైనా ఉంటే) మొదలైన వాటి గురించి మీ జీవిత భాగస్వామికి నిజాయితీగా వివరించడం మంచిది. దీనివల్ల దీర్ఘకాలికంగా పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం వీలవుతుంది.

ఈ ప్రక్రియ పూర్తయ్యాక, మీతో పాటు మీ జీవిత భాగస్వామి పోర్ట్‌ఫోలియోలోనూ తగినంత వైవిధ్యం ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకవేళ అవసరమైతే ఇద్దరి పోర్ట్‌ఫోలియోలను ఒకే దగ్గర చేర్చే అంశం పరిశీలించాలి. కుటుంబ అవసరాల కోసం కూడా పొదుపు చేయాలి కాబట్టి.. మరింత సురక్షితమైన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిని పోర్ట్‌ఫోలియోలో చేర్చాలి.

అలాగే, పిల్లల ఆర్థిక అవసరాల (చదువులు మొదలుకుని వివాహాల దాకా) గురించి ముందుగానే ప్రణాళిక వేసుకుని, ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాలి. వీటి గురించి కూడా ఎంత త్వరగా ప్లానింగ్ మొదలుపెడితే అంత ఎక్కువ నిధి పోగవుతుంది. పిల్లలకు సంబంధించి స్వల్పకాలిక అవసరాల కోసం (బొమ్మలు, ఔషధాలు మొదలైనవి) అధిక లిక్విడిటీ వెసులుబాటు ఉండే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలాగే చదువు లేదా పెళ్లిళ్లు వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటితో పాటు బీమా కవరేజీ తగింత ఉండేలా చూసుకోవాలి. వాహనం, గృహం, జీవిత బీమా, ఆరోగ్య బీమా ఇలాంటి వాటన్నింటి కవరేజీ పరిశీలించుకోవాలి. భవిష్యత్‌లో ఏదైనా జరగకూడనిది జరిగితే పరిస్థితులను ఎదుర్కొనగలిగేలా జాగ్రత్తపడాలి. సాధ్యమైనంత వరకూ చిన్న వయసులోనే టర్మ్ ప్లాన్లను తీసుకోవడం మంచిది. దీనివల్ల తక్కువ ప్రీమియాలకు ఎక్కువ జీవిత బీమా కవరేజీ పొందవచ్చు. వైద్య అవసరాల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోవచ్చు.

ఇవే కాకుండా అత్యవసర పరిస్థితుల కోసం కొంత మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే .. కొత్తగా మరో ఉద్యోగం వచ్చేలోగా ఇల్లు గడవడానికి కావల్సిన ఖర్చుల కోసం, ఒకవేళ అప్పటికే రుణాలేవైనా ఉంటే వాటికి నెలసరి కట్టాల్సిన వాయిదాలు మొదలైన వాటికి ఈ ఫండ్ నుంచి డబ్బు ఉపయోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని మీరు రెగ్యులర్‌గా వాడే అకౌంటులో కాకుండా ప్రత్యేకంగా వేరే అకౌంటులో ఉంచుకోవడం మంచిది.
 
గుర్తుంచుకోదగినవి..
- వివాహం అనంతరం ప్రాధా న్యతలు, ఆర్థిక లక్ష్యాలు మారిపోతాయి. వాటికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- పెళ్లి తర్వాత మీ జీవిత భాగస్వామి ఆదాయ, వ్యయాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
- పిల్లల కోసం సాధ్యమైనంత త్వరగా ఆర్థిక ప్రణాళికను అమల్లో పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement