
సాక్షి, న్యూఢిల్లీ :
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేయబోతుంది. బినామీ ఆస్తులపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు అందజేస్తే, కోటి రూపాయల వరకు నగదు రివార్డులను ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో దీనికి సంబంధించి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని తెలిపారు. వివరాలు అందజేసిన వారు రూ.15 లక్షల నుంచి కోటి రూపాయల వరకు బహుమతి అందుకునే అవకాశముందని అధికారి చెప్పారు. సమాచారం అందజేసిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచనున్నట్టు తెలిసింది.
గతేడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో మాత్రం ఈ నిబంధన లేదు. కానీ గోప్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు బినామీ ఆస్తుల వివరాలు అందజేసిన వారికి ఈ రివార్డులను ఇవ్వనున్నారు. 2016 నవంబర్ 1న బినామీ లావాదేవీల సవరణ చట్టం 2016 అమల్లోకి వచ్చింది. ఈ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పలు బినామీ లావాదేవీలను ఏజెన్సీలు గుర్తించాయి. బ్యాంకు అకౌంట్ డిపాజిట్లు, స్థిర ఆస్తులు వంటి వాటిని బినామీ ఆస్తుల కింద అటాచ్ కూడా చేశాయి.