
సంప్రదాయ ఇన్వెస్టర్ అయితే.. పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే.. అటువంటి వారు హెచ్‌డీఎఫ్‌సీ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఇది ప్రధానంగా 60 నెలల కాల వ్యవధికి మించని డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ పథకం 2010లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఇచ్చిన రాబడులను పరిశీలిస్తే బ్యాంకు డిపాజిట్ల కంటే కాస్త మెరుగైన రాబడులనే ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
2017లో ఆర్‌బీఐ ఒకే ఒక్కసారి వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా అప్పటి నుంచి వేచి చూసే ధోరణిని అనుసరిస్తోంది. మధ్య కాలానికి 4 శాతం పరిధిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనుకుంటున్న దృష్ట్యా ఇప్పటికైతే వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు కేంద్రం ద్రవ్యలోటు విషయంలో లక్ష్యాన్ని చేరుకోవడంపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఆటుపోట్లకు పరిమితం చేసే హెచ్‌డీఎఫ్‌సీ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
మంచి ట్రాక్ రికార్డు
రాబడుల పరంగా ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. అన్ని రకాల వడ్డీ రేట్ల సమయాల్లోనూ మంచి పనితీరే ప్రదర్శించింది. బాండ్లకు అత్యంత అనుకూలంగా ఉన్న 2016లో ఏకంగా 10.6 శాతం రిటర్నులు పంచింది. గిల్ట్ ఫండ్లకు ప్రతికూలంగా ఉన్న 2015లోనూ రాబడులు 8.6 శాతానికి తగ్గలేదు. ఇక గిల్ట్ ఫండ్లకు ప్రతికూలంగా ఉన్న గతేడాది (2017లో) చాలా వరకు గిల్ట్ ఫండ్స్ రాబడులు 5–6 శాతానికి పరిమితం కాగా, హెచ్‌డీఎఫ్‌సీ మీడియం టర్మ్ ఆపర్చునిటీస్ 6.5 శాతం రాబడులిచ్చింది.
ఇప్పటి వరకు రాబడుల పరంగా చూస్తే ఏటా సగటున 8.9 శాతం రాబడినిచ్చింది. మూడేళ్ల కాలంలో చూసుకుంటే 8.3 శాతం, ఐదేళ్ల కాలంలో సగటున 8.7 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఈ ఫండ్ పెట్టుబడులకు సంబంధించిన వడ్డీ రేట్ల రిస్క్ చాలా పరిమితం. ఎందుకంటే ఏడాదిన్నర నుంచి మూడున్నరేళ్ల కాల వ్యవధి కలిగిన బాండ్లే దీని పోర్ట్ ఫోలియోలో ఎక్కువగా ఉంటాయి. అధిక రేటు కలిగిన (ఏఏఏ) బాండ్లలో, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో క్రెడిట్ రిస్క్ తగ్గుతుంది.
ఈ ఫండ్ మొత్తం నిధుల్లో 76 శాతం ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఉన్నాయి. 19 శాతం ప్రభుత్వ బాండ్లకు కేటాయించింది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ బాండ్లలో ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న పెట్టుబడుల విలువ సుమారు రూ.13,000 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment