ఎయిర్‌టెల్‌లాభం హైజంప్
న్యూఢిల్లీ: కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14) జనవరి-మార్చి(క్యూ4) కాలంలో 89% అధికంగా రూ. 962 కోట్ల నికర లాభాన్ని పొందింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ. 509 కోట్లను మాత్రమే ఆర్జించింది. కాల్ చార్జీలు పెరగడం, డేటా బిజినెస్ నుంచి ఆదాయం పుంజుకోవడం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది.
కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ఆదాయం 93%పైగా ఎగసి రూ. 1,900 కోట్లను తాకడం పనితీరు మెరుగుకు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇక మొత్తం ఆదాయం 13%పైగా వృద్ధితో రూ. 22,219 కోట్లకు చేరింది. గతంలో రూ. 19,582 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో వాయిస్ సర్వీసులపై నిమిషానికి 37.07 పైసలు లభించినట్లు కంపెనీ తెలిపింది. ఇది 2.08 పైసలు అధికంకాగా, నెట్‌వర్క్ వినియోగం 4.6% పెరిగి 264.8 బిలియన్ నిమిషాలను తాకినట్లు వెల్లడించింది. కాగా, క్యూ4లో అంతర్జాతీయ ఆదాయం(ఆఫ్రికా, దక్షిణాసియా) 3% వృద్ధితో 121 కోట్ల డాలర్లకు(దాదాపు రూ. 7,300 కోట్లు) చేరింది. ఆఫ్రికా కార్యకలాపాలపై 12.4 కోట్ల డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 1.80 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది.
పూర్తి ఏడాదికి సైతం...
పూర్తి ఏడాదికి ఎయిర్‌టెల్ నికర లాభం దాదాపు 22% వృద్ధితో రూ. 2,773 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 2,276 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇక ఆదాయం సైతం 11%పైగా పెరిగి రూ. 85,746 కోట్లకు చేరింది. గడిచిన ఏడాదిలో కంపెనీ పనితీరు సంతృప్తినిచ్చినట్లు భారతీ ఎయిర్‌టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు.
ఇతర ముఖ్యాంశాలివీ...
ఇండియాలో మొబైల్ డేటా ఆదాయం 89% ఎగసి రూ. 1,325 కోట్లకు చేరింది.
మార్చి చివరికి మొబైల్ డేటా కస్టమర్ల సంఖ్య 33.5% పెరిగి 58.1 మిలియన్లకు చేరింది. 3జీ కస్టమర్ల సంఖ్య 10 మిలియన్లుగా నమోదైంది.
ఇండియాలో ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 196.
క్యూ4లో డేటా ఏఆర్‌పీయూ 43%పైగా పుంజుకుని రూ. 79కు చేరింది.
మార్చి చివరికల్లా కంపెనీ రుణాలు రూ. 60,542 కోట్లుగా నమోదయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్ షేరు 1% నష్టంతో రూ. 335 వద్ద ముగిసింది.