భెల్‌ లాభం డబుల్‌ | BHEL net rises 112% on higher sales | Sakshi
Sakshi News home page

భెల్‌ లాభం డబుల్‌

Published Wed, May 30 2018 1:45 AM | Last Updated on Wed, May 30 2018 1:45 AM

BHEL net rises 112% on higher sales  - Sakshi

న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్‌ నికర లాభం నాలుగో త్రైమాసిక కాలంలో దాదాపు రెట్టింపైంది. 2016–17 క్యూ4లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌ఆలోన్‌) తాజా క్యూ4లో 112 శాతం వృద్ధితో రూ.457 కోట్లకు ఎగసింది. రాబడి అధికంగా రావడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని భెల్‌ తెలిపింది.

ఇక మొత్తం ఆదాయం రూ.10,476 కోట్ల నుంచి రూ.10,342 కోట్లకు పడిపోగా, టర్నోవర్‌ మాత్రం రూ.9,479 కోట్ల నుంచి రూ.9,833 కోట్లకు ఎగసిందని భెల్‌ సీఎమ్‌డీ అతుల్‌ సోబ్తి చెప్పారు. నిర్వహణ లాభం రూ.569 కోట్ల నుంచి దాదాపు రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,232 కోట్లకు పెరిగిందని, నిర్వహణ లాభ మార్జిన్‌ 6.3 శాతం వృద్ధితో 12.1 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

మొత్తం డివిడెండ్‌ 91 శాతం
రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు 51 శాతం (రూ.1.10) డివిడెండ్‌ను చెల్లించనున్నామని సోబ్తి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను 40 శాతం మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, దీంతో మొత్తం డివిడెండ్‌ 91 శాతానికి పెరుగుతుందని వివరించారు.

గత నాలుగేళ్లలో ఇదే అత్యధిక డివిడెండ్‌ అని తెలిపారు. 1976–77 నుంచి అప్రతిహతంగా డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇక 2016–17లో రూ.496 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.807 కోట్లకు పెరిగిందని సోబ్తి చెప్పారు. టర్నోవర్‌ రూ.27,740 కోట్ల నుంచి రూ.27,850 కోట్లకు పెరిగిందని తెలిపారు.

రూ.1,18,000 కోట్లకు ఆర్డర్లు..
పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో రూ.40,932 కోట్ల ఆర్డర్లను సాధించామని, మార్కెట్‌ వాటా మరింతగా పెంచుకున్నామని అతుల్‌ సోబ్తి చెప్పారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆర్డర్లు, రూ.33,342 కోట్లతో పోల్చితే 74% వృద్ధి సాధించామని వివరించారు.

ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఆర్డర్లు రూ.1,18,000 కోట్లకు చేరాయని, గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. లాభాల జోరుతో బీఎస్‌ఈలో భెల్‌ షేర్‌ దూసుకెళ్లింది. స్టాక్‌ మార్కెట్‌ పడినప్పటికీ, ఈ షేర్‌ ఇంట్రాడేలో 10% లాభంతో రూ.86.80ను తాకింది. చివరకు 5.5 శాతం లాభంతో రూ.83.60 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement