‘బిగ్ సి’ ప్రచారకర్తగా రకుల్..
మార్చి నాటికి 150 స్టోర్లు
* బిగ్ సి ఫౌండర్ బాలు చౌదరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ తార రకుల్‌ప్రీత్ సింగ్‌ను నియమించుకుంది. దేశంలో మొబైల్ రిటైల్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునే ట్రెండ్ తమతోనే ప్రారంభమైందని ఈ సందర్భంగా బిగ్ సి వ్యవస్థాపకులు బాలు చౌదరి తెలిపారు. 2006లో సినీ తార చార్మితో మొదలై కాజల్, ఇలియానా, సమంత, శృతిహాసన్‌లు ప్రచార కర్తలుగా వ్యవహరించారని గుర్తు చేశారు. కొత్త అంబాసిడర్‌ను ప్రకటించేందుకు ఆదివారం ఏర్పాటైన సమావేశంలో డెరైక్టర్లు స్వప్నకుమార్, కృష్ణపవన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
అందుబాటు ధర, విక్రయానంతర సేవలు, కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించడం వల్లే 14 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నామని అన్నారు. కస్టమర్ల సంఖ్య 4 కోట్లు దాటిందని వెల్లడించారు. మొబైల్స్ విక్రయంలో సుస్థిర స్థానమున్న బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని రకుల్ అన్నారు.
ఎక్స్‌క్లూజివ్‌గా 4జీ స్మార్ట్‌ఫోన్..: బిగ్ సి స్టోర్లలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 90% 4జీ మోడళ్లు ఉంటున్నాయి. దీంతో నెలాఖరుకల్లా రూ.2,999 ధరలో 4జీ మోడల్‌ను బిగ్ సి ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ప్రముఖ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు బాలు చౌదరి చెప్పారు. ప్రస్తుతం 118 స్టోర్లున్నాయని, వీటిని మార్చికల్లా 150కి చేర్చుతామన్నారు. ఇక సంస్థ ఆదాయంలో చైనా బ్రాండ్ల వాటా 25%. 3-6 నెలల్లో ఇది 50%కి చేరుతుందని, ఫోన్ల నాణ్యతే ఇందుకు కారణమని చెప్పారు. పండుగల సీజన్‌లో రెండింతల అమ్మకాలు నమోదవుతాయని ధీమా వ్యక్తం చేశారు.