పడిపోయిన ముకేశ్ ర్యాంక్
* ఫోర్బ్స్ 2014-ప్రపంచ బిలియనీర్ల జాబితా..
న్యూయార్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత సంపన్న వ్యక్తిగానే కొనసాగుతున్నప్పటికీ.. ప్రపంచ దిగ్గజాలతో పోలిస్తే భారీగా సంపదను కోల్పోతున్నారు. ఫోర్బ్స్ మ్యాగజీన్ రూపొందించిన ప్రపంచ బిలియనీర్ల జాబితా-2014లో ముకేశ్ 40వ స్థానానికి(గతేడాది 22వ ర్యాంక్) పడిపోయారు. ఎనిమిదేళ్లలో ఇదే అత్యంత కనిష్టస్థాయి ర్యాంకింగ్. ముకేశ్ సంపద ఏడాది వ్యవధిలో 2.9 బిలియన్ డాలర్లు ఆవిరై... 18.6 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు ఫోర్బ్స్ పేర్కొంది.
2006లో 8.5 బిలియన్ డాలర్ల సంపదతో తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన ముకేశ్ అప్పట్లో గ్లోబల్ లిస్ట్‌లో 56వ స్థానాన్ని దక్కించుకున్నారు. 2008లో ముకేశ్ అంబానీ తొలిసారిగా ప్రపంచ టాప్-10 కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు (ఐదో ర్యాంక్). అప్పుడు ఆయన సంపద 43 బిలియన్ డాలర్లు. అప్పటినుంచీ క్రమంగా సంపద తరిగిపోవడంతో ర్యాంకింగ్‌లోనూ జారిపోయారు.
రూపాయి క్షీణత, ఆర్థిక మందగమనం ఎఫెక్ట్...
ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ర్యాంక్ కూడా 41 నుంచి ఈసారి 52కు పడిపోయింది. 2005లో ఆయన గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఏకంగా 3వ స్థానంలో నిలవడం గమనార్హం. డాలరుతో రూపాయి విలువ క్షీణించడం, బలహీన ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు భారతీయుల సంపద దిగజారేందుకు కారణంగా నిలిచిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఈ ఏడాది 56 మంది(గతేడాది 55) భారతీయులకు ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కింది. అయితే, మొత్తం సంపద మాత్రం గతేడాది 193.6 బిలియన్ డాలర్ల నుంచి ఈసారి 191.5 బిలియన్ డాలర్లకు తగ్గింది. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. మెక్సికో టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్‌ను రెండో స్థానానికి నెట్టి ఈ ఏడాది మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన సంపద 9 బిలియన్ డాలర్లు ఎగబాకి 76 బిలియన్ డాలర్లకు చేరింది.