మళ్లీ బిల్ గేట్స్‌కే అగ్రస్థానం
⇒ ఫోర్బ్స్ శ్రీమంతుల జాబితాలో ఫస్ట్
⇒ లిస్టులో అరబిందో, దివీస్ వ్యవస్థాపకులు
న్యూయార్క్: ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ నంబర్‌వన్‌గా నిల్చారు. 86 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా నాలుగోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. బెర్క్‌షైర్ హాథ్‌వే చీఫ్ వారెన్ బఫెట్ 75.6 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా.. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో నిల్చారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన శ్రీమంతుల జాబితాకు సంబంధించి టాప్ టెన్‌లో సింహభాగం టెక్నాలజీ దిగ్గజాలే ఉన్నారు.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ (5వ స్థానం), ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్ (7వ స్థానం) టాప్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల జనాభా క్రితం ఏడాదితో పోలిస్తే ఈసారి 13 శాతం పెరిగి 2,043కి చేరింది. 31 సంవత్సరాల క్రితం సంపన్నుల జాబితాను రూపొందించడం మొదలుపెట్టినప్పట్నుంచీ ఇదే అత్యధిక పెరుగుదల అని ఫోర్బ్స్ పేర్కొంది. అత్యధికంగా 565 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 319 బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో, 114 మందితో జర్మనీ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 220 స్థానాలు దిగజారి 544వ స్థానానికి పరిమితమయ్యారు.
దేశీయంగా అంబానీ ఫస్ట్..
భారత్ విషయానికొస్తే 23.2 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 33వ ప్లేస్‌లో ఉన్నారు. పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ 1.3 బి. డాలర్లతో 1,567వ స్థానంలో నిల్చారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అరబిందో ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి 2.6 బిలియన్ డాలర్లతో 782వ స్థానంలోనూ, దివీస్ ల్యాబరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి 1.6 బిలియన్ డాలర్లతో 1,290 స్థానంలో నిల్చారు.