
న్యూయార్క్ : అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందట. 2008లో ఎదుర్కొన్న సంక్షోభం మాదిరే మళ్లీ తలెత్తే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తెలిపారు. ఇటీవల జరిగిన ''ఆస్క్ మి ఏనీథింగ్(నన్నేమైనా అడగండి)'' అనే కార్యక్రమంలో బిల్‌గేట్స్ ఈ విషయాన్ని తెలిపారు. 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటిది సమీప భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్నదా? అని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బిల్‌గేట్స్.. అవును అని చెప్పడం కష్టమే అయినప్పటికీ అలాంటి సంక్షోభం తలెత్తడం తథ్యమని హెచ్చరికలు జారీచేశారు.
2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇరకాటంలో కూరుకుపోయింది. దాదాపు 88 లక్షల ఉద్యోగాలు అమెరికన్ ప్రజలు కోల్పోయారు. అమెరికా ప్రజల నికర సంపద కూడా 19 ట్రిలియన్ డాలర్లకు పైగా(19 లక్షల కోట్ల డాలర్లు) హరించుకుపోయింది. గృహాలు లేనివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని గేట్స్ చెప్పినప్పటికీ, ఇన్నోవేషన్, క్యాపిటలిజం మరింత మెరుగైతే దాన్ని నుంచి బయటపడటం సాధ్యమవుతుందని గేట్స్ చెప్పారు.