విశాఖలో బయోకాన్ యూనిట్ ఏర్పాటు
ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీలో కంపెనీ సీఎండీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణంలో బయోకాన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫార్మా రంగ దిగ్గజం, బయోకాన్ సంస్థ సీఎండీ కిరణ్ మజుందార్ షా ప్రకటించారు. ఆదివారం ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ ఆర్నెల్లలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బయోకాన్ సంస్థ రూపొందించిన ఈ-హెల్త్‌కేర్ తద్వారా ఒనగూరే ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కిరణ్ వివరించారు.
టెలిమెడిసిన్ ద్వారా రోగుల ఆరోగ్య వివరాల్ని నెట్‌లో ఉంచి ఎలా వైద్య సేవలు పొందవచ్చో ఈ సందర్భంగా వివరించారు. ఈ-డయాగ్నోస్టిస్ కాన్సెప్ట్ గ్రామీణ పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణులకు, వైద్యం కోసం నగరాలకు రాలేని వారికి ఈ చికిత్సా విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒడిశాలో 50, రాజస్థాన్‌లో 100 కేంద్రాలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలోనూ 100 నుంచి 200 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.