'మోదీ'పై చంద్రబాబు అసహనం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చట్టబద్ధంగా రావలసిన వాటిలో కొన్నే వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
విభజన నేపథ్యంలో తలెత్తిన సమస్యలను ఇరు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని, లేదంటే కేంద్రమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ విభజన జరిగి రెండేళ్లు దాటినా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లోటు రూ.16 వేల కోట్లు భర్తీ చేయాల్సి ఉండగా కేంద్రం రూ. 4800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. సెంట్రల్, గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు కాలేదని, పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.800 కోట్లే ఇచ్చిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. వెనకబడిన ప్రాంతాలకు రావలసిన నిధులూ ఇవ్వడం లేదు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, రాజధాని నిర్మాణానికి నిధులూ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ కేంద్రం అమలు చేయాలని, పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేలా సాయం చేయాలని కోరారు.