లండన్/టోక్యో : షేర్ మార్కెట్‌ను తలదన్నుతూ లాభాల్లో దూసుకువెళుతున్న బిట్ కాయిన్... మార్కెట్లను షేక్ చేస్తోంది. గతవారం అత్యధికంగా 20వేల డాలర్లకు అంటే 12లక్షల 80వేలకు చేరిన ఈ కరెన్సీ... ఒక్కసారిగా ఢమాలమని పడిపోయింది. కేవలం ఐదు రోజుల్లోనే మూడో వంతు తన విలువను కోల్పోయిన బిట్‌కాయిన్, లక్సెంబర్గ్ ఆధారిత బిట్‌స్టాంప్ ఎక్స్చేంజ్‌లో 13వేల డాలర్లుగా నమోదైంది. అంటే రూ.8.50 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్యలో ట్రేడైంది. ఒకేసారి 20వేల డాలర్ల నుంచి 13వేల డాలర్లకు పడిపోవడంతో, 2013 నుంచి ఇదే అతి చెత్త వారంగా రికార్డైంది.
ప్రతి రోజూ కొద్ది కొద్దిగా పడిపోతూ వస్తున్న బిట్ కాయిన్, శుక్రవారం దాని నష్టాలు మరింత పెరిగాయి. 12,560 డాలర్ల కనిష్ట స్థాయిలకు కూడా ఇది పడిపోయింది. ఒక్క రోజులోనే సుమారు 20 శాతం తన విలువను కోల్పోవడం గమనార్హం. వర్చ్యువల్ రూపంలో ఉండే బిట్ కాయిన్ పై.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇండియాలో ఇంకా ఈ కరెన్సీని అధికారికంగా గుర్తించలేదు. చాలా దేశాలు, మార్కెట్ నిపుణులు బిట్‌కాయిన్‌పై ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇది అంత సేఫ్ కాదంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు.
అయితే క్రిస్మస్, న్యూఇయర్ పండుగలు రావటంతో చాలామంది బిట్ కాయిన్ పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగినట్టు విశ్లేషకులు చెప్పారు. పెద్ద సంఖ్యలో విక్రయాలకు పాల్పడటంతో ధర పడిపోయిందని పేర్కొన్నారు. మరోవైపు బిట్ కాయిన్ లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలని సెబీ కూడా హెచ్చరిస్తోంది. బిట్ కాయిన్‌పై హెచ్చరికలు జారీ అవుతున్న సమయంలోనే ఈ విలువ ఒక్కసారిగా భారీగా పడిపోయింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఇది మరింత తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment