పెట్టుబడుల విషయంలో సలహా సేవల పేరుతో ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున జరిగిన మోసం ఇటీవల వెలుగుచూసింది. ట్రోకా పేరుతో రూ.10 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన ముగ్గురి పెట్టుబడుల సలహాలన్నీ మోసపూరితమేనని, అవి ఫలితాలు ఇవ్వలేదని, కాల్ చేసినా వారి నుంచి స్పందన లేదంటూ ఇన్వెస్టర్ల నుంచి సెబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. పైగా ఈ కేటుగాళ్లు సెబీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ వాస్తవ లైసెన్స్ చూపించి మరీ మోసానికి పాల్పడడం పరాకాష్ట. ఇందుకు సంబంధించి రిషబ్ జైన్, ఉబైదుర్ రెహ్మాన్, జి కాదర్ హుస్సేన్‌లపై సెబీ నిషేధం విధిస్తూ ఈ ఏడాది మార్చి 20న ఆదేశాలు జారీ చేసింది. అయితే, మనలోనూ చాలా మందికి ఈ తరహా అనుభవాలు ఎదురు కావచ్చు. ముఖ్యంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారికి మధ్యప్రదేశ్, ఇండోర్ కేంద్రంగా కాల్స్ వస్తుంటాయి. తాము స్టాక్స్ రికమండేషన్స్ ఇస్తామని, ముందు ఉచిత ట్రయల్ కూడా ఉందంటూ వారు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రాబడులకు హామీ లేదు...
రిషబ్ జైన్, అతడి భాగస్వాములు భారీ హామీలను గుప్పించారు. తమ వెబ్‌సైట్‌లో రెండు ఉత్పత్తుల సమాచారాన్ని వీరు ఆకర్షణీయంగా పొందుపరిచారు. స్టాక్ ఆప్షన్ (నష్టాల్లేని) జాక్‌పాట్ ఇందులో ఒకటి. నిఫ్టీ ఆప్షన్ (నష్టాల్లేని) జాక్‌పాట్ మరొకటి. 95–99 శాతం కచ్చితమైన రికమండేషన్, నష్టాలు సున్నా, జాక్‌పాట్ వంటి పదాలను వినియోగించారు. వీటి ద్వారా అద్భుతమైన రాబడులపై ఇన్వెస్టర్లలో ఆశలు కల్పించారు. మొత్తం 10 వెబ్‌సైట్ల ద్వారా వీరు ఈ తరహా పెయిడ్ సూచనల సేవల వ్యవహారాలు నడిపినట్టు సెబీ దర్యాప్తులో వెలుగు చూసింది. నిఫ్టీష్యూర్ షాట్ డాట్‌కామ్, న్యూస్‌బేస్డ్‌టిప్స్ డాట్ కామ్, ఆప్షన్‌టిప్స్ డాట్ ఇన్ సైట్లు కూడా వీరు నిర్వహించినవే.
ఈ తరహా జాక్‌పాట్, నష్టాల్లేని, కచ్చితమైన రికమండేషన్స్ అనే పదాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు ప్రతీ లావాదేవీలో రావడమన్నది అసాధ్యం. ఈ తరహా పదాలతో కూడిన ప్రకటనలు స్పెక్యులేటివ్ తరహావిగా భావించాలి. ఎందుకంటే సెబీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ గైడ్‌లైన్స్ 2013, సెబీ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ ప్రకారం... ఏ మ్యూచువల్ ఫండ్ కూడా, డిస్ట్రిబ్యూటర్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రాబడులపై భరోసా కానీ, గ్యారంటీ కానీ ఇవ్వరాదు. ‘‘మార్కెట్ ఆధారిత సాధనాలపై రాబడులు గ్యారంటీ అని పేర్కొంటే అది మోసపూరితమే. ఎవ్వరూ ఈ తరహా హామీ ఇవ్వరాదు. వారు వారి ట్రాక్ రికార్డునే ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తు రాబడులపై హామీలు ఇవ్వరాదు’’ అని ఓరో వెల్త్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కృష్ణ కుప్ప తెలిపారు.
స్టాక్ టిప్స్‌కు దూరం
స్టాక్ టిప్స్ రూపంలోనూ పెద్ద ఎత్తున మోసాలు జరుగుతాయన్న అవగాహన అవసరం. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ గైడ్‌లైన్స్ ప్రకారం పెట్టుబడులకు సంబంధించి సలహాలిచ్చే వారు... కస్టమర్ల రిస్క్‌కు తగిన పోర్ట్‌ఫోలియోను సూచించాల్సి ఉంటుంది. ఆయా సాధనాల్లో ఉండే రిస్క్ గురించి కూడా వివరించాలి. కానీ, జైన్ అతడి సహచరులు మాత్రం ఈ పనిచేయలేదు. సెబీ వద్ద నమోదు చేసుకున్న సలహాదారులు... కేవలం ఈక్విటీలే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఇలా అన్ని రకాల సాధనాల గురించి తెలియజేయడంతోపాటు, ఇన్వెస్టర్లకు అనుకూలమైన వాటిని సూచించాలి. ‘‘స్టాక్ ట్రేడింగ్ టిప్స్ ఇచ్చే వారి విషయంలో అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే వాటి రూపంలో మోసాలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. కస్టమర్లు అధిక రాబడులు ఆశిస్తుంటారు. కొంత మంది ఆర్థికంగా కష్టాల్లో ఉండడంతో భారీ రాబడులు వచ్చే చోట ఇన్వెస్ట్ చేసి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలని చూస్తుంటారు. దీన్నే మోసగాళ్లు అవకాశంగా మలుచుకుంటారు’’ అని అర్థయంత్ర సీఈవో నితిన్ బి వ్యాకరణం తెలిపారు.
ట్రాక్ రికార్డు
మీరు ఎంచుకునే సలహాదారులు, సలహా సంస్థలకు సంబంధించి గత ట్రాక్ రికార్డు అనేది ఒక ఆధారంగా పనికొస్తుంది. కానీ, ఆ ట్రాక్ రికార్డులో వాస్తవమెంతో ఎవరు చూసొచ్చారు? ఓ సారి ఆలోచించండి. జైన్ టీమ్ తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్న రాబడుల చరిత్ర అంతా మోసపూరితమే. సానుకూల రివ్యూలు వారు సృష్టించినవి. అద్భుతమైన రాబడుల వివరాలను కూడా వారే కల్పించారు. వీటి ద్వారా చందాదారులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్టు సెబీ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. అందుకే ఈ తరహా పోర్టల్స్‌లోని సమాచారాన్ని గుడ్డిగా నమ్ముకోకూడదు. గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా ఆయా పోర్టల్స్ రికమండేషన్లలో ఉన్న మోసాల గురించి తోటి బాధితులు ఎవరైనా వివరాలు ఉంచితే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్ చెల్లింపులు
ఇక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సంస్థ గురించి బయట విచారించకోకుండా, ఆన్‌లైన్‌లోనే సబ్‌స్క్రిప్షన్ చెల్లించేయడం సరికాదు. మీ డబ్బులను తీసుకుని సదరు సంస్థ ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జైన్, అతడి బృందం చేసిన పనే ఇది. పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్ల నుంచి చందాలు తీసుకుని కాల్ చేసినా స్పందించకుండా ఉడాయించారు. ఆన్‌లైన్ వేదికగా ఫైనాన్షియల్ సేవలు అందించే సంస్థలు అన్నింటికీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఉండాలి. వీరితో ఒకసారి మాట్లాడి వివరాలను ధ్రువీకరించుకోవడం మంచిది. కాల్ చేసినప్పుడు మీ పెట్టుబడి రెట్టింపు అవుతుందని, రాబడులు గ్యారంటీ అనే మాటలు అటునుంచి వినిపిస్తే వారికి దూరంగా ఉండడం మంచిదన్నది నితిన్ వ్యాకరణం సూచన.
ఆధారాలను పరిశీలించాల్సిందే
మష్రువాలా, క్యాప్‌మెట్రిక్స్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌ల లైసెన్స్‌లను ట్రోకా తనవిగా చూపించుకుని, సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్‌గా చలామణి కావడం గమనార్హం. కనుక సలహా తీసుకునే ముందు సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లైసెన్స్ వాస్తవమైనదేనా అన్నది కూడా చూడాలని ఈ అనుభవం చెబుతోంది. డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఏదన్నది తెలిస్తే... యాంఫి సైట్‌కు వెళ్లి డిస్ట్రిబ్యూటర్ గుర్తింపును చెక్ చేసుకోవచ్చు. సెబీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ నిజమైనదేనా కాదా పరిశీలించుకోవచ్చు. వ్యక్తి పేరు లేదా వెబ్‌సైట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా వివరాలు తెలుసుకునే వీలుంది. రికార్డుల్లో కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ తదితర వివరాలు లభిస్తాయి. ఆ వివరాల ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయాలి.
ఆ తర్వాత వారి వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలతో సరిపోల్చుకోవడం ద్వారా అసలైన వారా, నకిలీనా అన్నది తెలుసుకోవచ్చు. తమ వెబ్‌సైట్ దిగువ భాగంలో యాంఫి రిజిస్ట్రేషన్ నంబర్ (69583)ను చూడొచ్చని ఫండ్స్ ఇండియా డాట్ కామ్ సీవోవో శ్రీకాంత్‌మీనాక్షి సూచించారు. ఆ నంబర్‌పై క్లిక్ చేస్తే స్కాన్డ్ డాక్యుమెంట్ పాపప్ స్క్రీన్‌ఫై కనిపిస్తుందని, అందులో సంస్థ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూడొచ్చని తెలిపారు. సంస్థ అసలు పేరు వెల్త్ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అని అక్కడ ఉంటుందని చెప్పారు. యాంఫి వెబ్‌సైట్‌కు వెళ్లి తమ రిజిస్ట్రేషన్ నంబర్ 69583ను ఎంటర్ చేసినా అవే వివరాలు కనిపిస్తాయన్నారు. వివరాలు అక్కడ లేకుంటే సమస్య ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment