అప్పుకూ కావాలి... మార్కులు! | Borrowing needs ... marks! | Sakshi
Sakshi News home page

అప్పుకూ కావాలి... మార్కులు!

Published Sun, Jul 5 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

అప్పుకూ కావాలి... మార్కులు!

అప్పుకూ కావాలి... మార్కులు!

మీకు కొత్త క్రెడిట్ కార్డు కావాలా? లేదా మీ ప్రస్తుత క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుకోవాలనుకుంటున్నారా? లేదా గృహం... కారు వంటి అవసరాలకు సంబంధించి రుణం కోరుకుంటున్నారా..?  విషయం ఏదైనా... మీ రుణ దరఖాస్తుకు ఆమోద ముద్ర వేయాలంటే... బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు- అసలు మీ రుణ సామర్థ్యం ఎంత అన్న అంశాన్ని పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు, లీవరేజ్ వంటి అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే సాధారణంగా వీటి గురించి చాలా మంది కస్టమర్లకు అసలు అవగాహన ఉండదు. ఆయా అంశాల గురించి తెలుసుకుని ‘మీ రుణ సామర్థ్యం’మీద ఎల్లప్పుడూ బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్ వ్యవస్థలు విశ్వాసం ఉంచుకునేలా చూసుకోవాల్సిన బాధ్యత తప్పనిసరి.
 
 క్రెడిట్ స్కోరంటే...
 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్- సిబిల్, ఈక్విఫాక్స్ వంటి క్రెడిట్ బ్యూరో సంస్థలు గడచిన 10 సంవత్సరాలుగా వ్యక్తిగత రుణ గ్రహీతలకు సంబంధించిన గణాంకాలను (డేటాబేస్)ను రూపొందిస్తున్నాయి. ఒక వ్యక్తి రుణం... నెలవారీ చెల్లింపుల పరిస్థితి... డిఫాల్ట్‌లు... ఇలా అన్ని విషయాలపై సమగ్ర సమాచారాన్ని సమీకరించి, నిక్షిప్తం చేసుకోవడం ఈ సంస్థల పని. తద్వారా ఆయా వ్యక్తిగత రుణ గ్రహీతలకు తగిన స్కోర్‌ను ఆయా సంస్థలు ఇస్తాయి. ఈ సమాచారాన్ని బ్యాంకింగ్, బ్యాంకింగ్ యేతర రుణ సంస్థలకు క్రెడిట్ బ్యూరోలు అందుబాటులో ఉంచుతాయి. ఏదైనా రుణానికి సంబంధించి రుణ దరఖాస్తు అందడంతోటే- క్రెడిట్ బ్యూరో స్కోర్ ఎంతన్న విషయాన్ని ఆయా ఆర్థిక సంస్థ పరిశీలిస్తుంది. దీనిపైన ఆధారపడే రుణ మంజూరు నిర్ణయం ఉంటుంది. రుణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తికి పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోర్‌ను ప్రమాణంగా తీసుకుంటున్నాయి.
 
 లీవరేజ్ అంటే...
 ఇక రుణం పొందడంలో కీలక పాత్ర పోషించేది లీవరేజ్. క్లుప్తంగా... కస్టమర్ రుణ మదింపు ప్రక్రియ ఇది. రుణ దరఖాస్తుదారునికి వచ్చే ఆదాయం ఎంత? ఇప్పటికే అతనికి ఎంత అప్పు ఉంది? (ఫిక్స్‌డ్ ఆబ్లిగేషన్స్ టూ ఇన్‌కమ్ రేషియో- ఎఫ్‌ఓఐఆర్)అన్న అంశం ప్రాతిపదికన ఈ మదింపు జరిగి, ఒక నిష్పత్తిని ఇక్కడ క్రెడిట్  బ్యూరోలు ఇస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలసరి వేతనం లక్ష రూపాయలని అనుకుందాం. నెలవారీ విడతల చెల్లింపులు (ఈఎంఐ) రూ.60 వేలు ఉంది. అంటే ఇక్కడ అతని ఎఫ్‌ఓఐఆర్ 60 శాతం. ఈ శాతం ఎంత తక్కువ ఉంటే... మీ రుణ దరఖాస్తుకు అంత వేగంగా ఆమోదముద్ర పడే వీలుంటుంది. ఈ శాతం ఎక్కువగా ఉందంటే... అతని రుణ చెల్లింపు సామర్థ్యం తక్కువ అని రుణ సంస్థలు భావిస్తాయి.

 విభిన్న విధానాలు..!
 రుణ అవసరం కావచ్చు లేదా దీనితో ముడివడి ఉన్న రుణ మొత్తం కావచ్చు... తాము ఇస్తున్న రుణం విషయంలో క్రెడిట్ బ్యూరో స్కోర్ ఎంత ఉండాలి? ఎఫ్‌ఓఐఆర్ ఎంత అవసరం? అన్న అంశాల్లో ఒక్కొక్క బ్యాంక్ లేదా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు తమ తమ స్థాయిల్లో, అంతర్గత రుణ మంజూరు విధానాల మేరకు నడుచుకుంటాయి.
 
 మీరు చేయాల్సింది?
 మీ క్రెడిట్ స్కోర్ అత్యధికంగా ఉండాలంటే... తీసుకున్న రుణాన్ని ఎటువంటి డిఫాల్ట్ లేకుండా సకాలంలో తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఇక  ఎఫ్‌ఓఐఆర్ విషయానికి వస్తే- ఆమోద స్థాయిని మించి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోకుండా ఉండడం ఇక్కడ మీకు కలిసివచ్చే అంశం. మీరు ఒకవేళ రుణానికి దరఖాస్తు పెడితే... సంబంధిత రుణ సంస్థే మీ స్కోర్ లేదా  ఎఫ్‌ఓఐఆర్‌ను పరిశీలిస్తుంది. మీరూ కావాలనుకుంటే... ప్రత్యక్షంగా క్రెడిట్ బ్యూరోల నుంచి మీ ‘క్రెడిట్ సామర్థ్యం’ స్కోర్ సమాచారాన్నీ పొందవచ్చు.
 
 సందేహాలు...
► క్రెడిట్ స్కోర్ లెక్కించడంలో టెలిఫోన్, మొబైల్, విద్యుత్, వాటర్ బిల్లుల చెల్లింపులను ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే ఈ విషయం పరిశీలనలో ఉంది.
► అలాగే వ్యక్తిగత సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, బీమా పథకాలు క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయలేవు.
► ఇప్పటి వరకు  క్రెడిట్ కార్డు గానీ, ఏ రకమైన రుణాలను గానీ తీసుకోకపోయి ఉంటే వారి గురించి సిబిల్ ఎలాంటి నివేదికా ఇవ్వదు.
 
 ముఖ్యాంశాలు చూస్తే...
► ఉదాహరణకు సిబిల్ మూడంకెల స్కోర్‌ను వ్యక్తిగత రుణ గ్రహీతలకు ఇస్తుంది. సహజంగా 300 నుంచి 900 మందికి ఈ స్కోర్ ఉంటుంది.
► మీ మార్కులు 900 దరిదాపుల్లో ఉంటే మీ రుణ దరఖాస్తుకు దాదాపు ఎటువంటి అడ్డంకులూ లేనట్లే. అంటే మీ ‘రుణ’ చరిత్ర అంతా పూర్తి సానుకూలంగా ఉందని అర్థం. సకాలంలో రుణ బకాయిలు చెల్లించడం ఈ స్కోర్‌కు చక్కటి మార్గం.
► సెక్యూర్డ్ రుణాలు అంటే... గృహ, ఆటో రుణాల విషయంలో ఆయా సంస్థలు కస్టమర్‌కు 650కి మించి సిబిల్ స్కోర్ ఉండాలని భావిస్తాయి. వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డుల వంటి అన్‌సెక్యూర్డ్ రుణాల విషయంలో ఈ స్కోర్ 750కి మించి ఉండాలని నిర్దేశించుకుంటాయి.
► రుణ పునఃచెల్లింపుల్లో వైఫల్యాలు, ఆ తరహా ప్రవర్తన, సెటిల్‌మెంట్లు వంటి అంశాల్లో ఆయా సంస్థల నుంచి పొందిన సమాచారం మేరకు స్కోరింగ్ సంస్థలు ‘రుణ చరిత్ర’కు సంబంధిత కస్టమర్‌కు తక్కువ మార్కులు వేస్తాయి. ఇలాంటి కారణాలు తదుపరి సందర్భాల్లో సంబంధిత రుణ గ్రహీతకు రుణ సంస్థల నుంచి అప్పు పుట్టని పరిస్థితిని సృష్టిస్తాయి.
► ఒక వ్యక్తికి బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ఎంత అప్పు ఉంది? అతని ఆర్థిక పరిస్థితులు ఏమిటి? వంటి అంశాలు సైతం క్రెడిట్ బ్యూరోలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఆయా సమాచారం ప్రాతిపదికన స్కోర్‌ను క్రెడిట్ సంస్థలు రుణ సంస్థలకు అందుబాటులో ఉంచుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement