![insurance banks financial companies asked to switch to 160 number series](/styles/webp/s3/article_images/2024/06/16/160-series.jpg.webp?itok=WtePLDj3)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల ‘160’ సిరీస్ నంబర్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో ఉన్న సంస్థలు మొదటి దశలో సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం '160' ఫోన్ నంబర్ సిరీస్‌కు మారుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.
అంటే ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీలు, ఇతర సంస్థల నుంచి సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ '160'తో మొదలయ్యే ఫోన్ నంబర్ల నుంచి వస్తాయి. మోసగాళ్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించడంలో సహాయపడటానికి ట్రాయ్ ఈ చర్య తీసుకుంది.
ట్రాయ్ అధికారులు, ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 25కు పైగా బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, టెల్కోలు సహా ఇతర ఆర్థిక సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రమోషనల్ అవసరాల కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న 140 సిరీస్ కార్యకలాపాలను డీఎల్‌టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ)కి మార్చడంపై ఈ సమావేశంలో చర్చించినట్లు, డిజిటల్ సమ్మతిని కూడా అమలు చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది.
సర్వీస్, ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం 160 సిరీస్, మార్కెటింగ్ కోసం 140 సిరీస్‌ను అమలు చేయడంతో.. 10 అంకెల నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పై గణనీయమైన నియంత్రణ ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం కంపెనీలకు చెందిన 10 అంకెల స్పామ్ నంబర్లలో చాలా వరకు కృత్రిమ మేధను ఉపయోగించి టెల్కోలు నేరుగా బ్లాక్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment