భారత్‌లో అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆఫర్లు
న్యూఢిల్లీ: భారత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థలు విమాన చార్జీలపై డిస్కౌంట్‌లు... కొత్త కొత్త సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ సంస్థ విమాన చార్జీల్లో 20% డిస్కౌంట్‌ను ప్రకటించింది. దక్షిణ అమెరికాకు వెళ్లే విమానాల్లో బిజినెస్ క్లాస్(క్లబ్ వరల్డ్) టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్‌కు నేటి నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే నెల 31లోపు ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇక లుఫ్తాన్సా సంస్థ బెంగళూరు-లండన్ మార్గంలో తొలిసారిగా ఈ నెల 22 నుంచి ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరి చయం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ఫ్రాంక్‌ఫర్ట్-బెంగళూరు మార్గంలో అంది స్తున్నామని పేర్కొంది.
మలేసియా ఎయిర్‌లైన్స్ యెస్ ఆఫర్లు
ఇక మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇయర్ ఎండ్ స్పెషల్ (యెస్) ఆఫర్లను అందిస్తోంది. భారత్ నుంచి మలేషియాకు ఎకానమీ క్లాస్ రాను, పోను చార్జీ రూ.11,860, ఇండోనేసియాకు రూ. 15,890, చైనాకు రూ.20,830, ఆస్ట్రేలియాకు రూ.39,660 అని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయని, వచ్చే నెల 2 వరకూ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది.