ముంబై : స్టాక్ మార్కెట్లు భారీగా క్రాష్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడంతో పాటు ఆసియన్ మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా కుదేలైంది. 1240 పాయింట్లు క్రాష్ అయిన సెన్సెక్స్ 33,517 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సైతం 369 పాయింట్ల ఢమాల్‌మని 10,300 మార్కుకు కిందకు పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల 40వేల కోట్లు హరించుకుపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 1041 పాయింట్ల నష్టంలో 33,715 వద్ద, నిఫ్టీ 313 పాయింట్ల నష్టంలో 10,352 వద్ద ట్రేడవుతున్నాయి. 2015 తర్వాత ఇవే అత్యంత కనిష్ట స్థాయి.
అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో భారీగా పతనం కావడంతో, ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై విపరీతంగా పడింది. అసలకే పన్ను ఆందోళనలతో భారీగా నష్టపోతున్న సూచీలు, అమెరికా మార్కెట్ల ప్రభావంతో ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. భారీగా అమ్మకాలు చోటు చేసుకున్నాయి.మరోవైపు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన రేపుతోంది. ద్రవ్యోల్బణ భయాలు పెరుగడంతో, కీలక వడ్డీరేటు అయిన రెపోను పెంచే అవకాశాలున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి.
అటు బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎల్‌టీసీజీ పన్ను, ద్రవ్యలోటు కూడా మార్కెట్లను పడగొడుతోంది. అమెరికా స్టాక్‌మార్కెట్లు డోజోన్స్, ఎస్ అండ్ పీ సూచీలు అతిపెద్ద ఇంట్రాడే పతనాలను నమోదుచేశాయి. వాల్‌స్ట్రీట్ ఎఫెక్ట్‌తో ఆసియన్ మార్కెట్లు భారీగా పడిపోయాయి. జపాన్ నిక్కీ 4.6 శాతం, ఆస్ట్రేలియన్ షేర్లు 3.0 శాతం క్షీణించాయి. అక్టోబర్ నుంచి ఇవే అత్యంత కనిష్ట స్థాయిలు. దక్షిణ కొరియా షేర్లు కూడా 2 శాతం పడిపోయాయి.
టాటా మోటార్స్ షేర్లు ఫలితాల ప్రకటన తర్వాత 10 శాతం పైగా క్రాష్ అయ్యాయి. మెటల్, రియాల్టీ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే దేశీయ రూపాయి విలువ కూడా భారీగా 29 పైసలు బలహీనపడి 64.36 వద్ద ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment