
28వేల దిగువకు సెన్సెక్స్
♦ బ్రెగ్జిట్ తర్వాత భారీ పతనం
♦ 310 పాయింట్లు నష్టపోయి 27,775కు ఇండెక్స్
♦ 103 పాయింట్లు కోల్పోయి 8,690కు నిఫ్టీ
లాభాల స్వీకరణ కొనసాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 28వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 8,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు(1.10 శాతం) నష్టపోయి 27,775 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు (1.19 శాతం)నష్టపోయి 8,690 పాయింట్ల వద్ద ముగిశాయి. ఏడు వారాల్లో సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం నుంచి చూస్తే ఇదే అత్యధిక పాయింట్ల పతనం.
అన్ని రంగాల షేర్లకూ నష్టాలే..
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, డాలర్ బలహీనపడడం, అమెరికా ముడి చమురు నిల్వలు పెరిగాయన్న తాజా నివేదిక కారణంగా సరఫరాలు పెరుగుతాయనే ఆందోళనతో ముడిచమురు ధరలు పడిపోవడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. రిఫైనరీ, ఇంధన, వాహన, ఫార్మా, విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, బ్యాంక్ షేర్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్‌ఈ అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.
ప్లస్ నుంచి మైనస్‌లోకి...: సెన్సెక్స్ లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారిపోయింది. 28,143-27,737 గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య 406 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.జీఎస్‌టీ ఆమోదం, మంచి వర్షాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపు జాప్యం వంటి అంశాలన్నింటినీ మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసుకుందని, ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే స్టాక్ సూచీలు 22 శాతం లాభపడటంతో లాభాల స్వీకరణ అనివార్యమని అంచనా.
అదానీ సెజ్ 8 శాతం అప్..
క్యూ1లో నికర లాభం 31 శాతం పెరగడంతో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్ 8 శాతం లాభంతో రూ. 259వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. యూరియా వ్యాపారాన్ని యారా ఫెర్టిలైజర్స్‌కు రూ.2,670 కోట్లకు విక్రయించడంతో టాటా కెమికల్స్ షేర్ 9 శాతం వరకూ పెరిగింది. లుపిన్, నష్టాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ షేర్ 4 శాతం క్షీణించి రూ.1,545కు పడిపోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్ పునర్వ్యస్థీకరణ చర్యల నేపథ్యంలో ఆదిత్య బిర్లా నువో 16 శాతం పెరిగింది.
మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు..,
30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోగా, మూడు షేర్లు-అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టీసీఎస్, కోల్ ఇండియా, మాత్రమే లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.6 శాతం, హీరో మోటొకార్ప్ 2.5%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.4%, మహీంద్రా అండ్ మహీంద్రా 2.2%, మారుతీ సుజుకీ 2%, టాటా మోటార్స్ 2%, సిప్లా 1.9 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.9%, ఏషియన్ పెయింట్స్ 1.5 శాతం, విప్రో 1.4 శాతం, టాటా స్టీల్ 1.4%, సన్ ఫార్మా 1.3 శాతం, ఎస్‌బీఐ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1,895 షేర్లు నష్టాల్లో, 835 షేర్లు లాభాల్లో ముగిశాయి.