ఐటీ డౌన్... మెటల్స్ అప్
సాఫ్ట్‌వేర్ రంగం వృద్ధి పట్ల సందేహాలు తలెత్తడంతో బుధవారం ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి మందగించవచ్చంటూ టీసీఎస్ హెచ్చరించడంతో ఈ షేరుతో పాటు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ షేరును ఇన్వెస్టర్లు విక్రయించారు.
అయితే ఇదే సమయంలో ఇండెక్స్ హెవీవెయిట్లు ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు పెరగడంతో స్టాక్ సూచీలు స్వల్పలాభాలతో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.25 పాయింట్ల పెరుగుదలతో 21,832.86 పాయింట్ల వద్ద క్లోజ్‌కాగా, నిఫ్టీ 7.40 పాయింట్లు లాభపడి 6,524 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్ షేర్లు టాటా స్టీల్, హిందాల్కో, సేసా స్టెరిలైట్‌లు 2-5% మధ్య ర్యాలీ జరిపాయి.
టాటా స్టీల్ కౌంటర్లో షార్ట్ కవరింగ్....
ఇన్వెస్టర్లు హఠాత్తుగా మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరపడంతో పాటు టాటా స్టీల్ ఫ్యూచర్ కాంట్రాక్టులో పెద్ద మొత్తంలో షార్ట్స్‌ను కవర్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్టు నుంచి 12.05 లక్షల షేర్లు (6.5 శాతం) కట్‌కావడంతో మొత్తం ఫ్యూచర్లో ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.71 కోట్ల షేర్లకు దిగింది. రూ. 350 నుంచి రూ. 380 స్ట్రయిక్స్ వరకూ కాల్ కవరింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్ల నుంచి వరుసగా 3.67 లక్షలు, 4.68 లక్షలు, 1.79 లక్షలు, 2.05 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యాయి.
తాజా కవరింగ్ తర్వాత కాల్ ఆప్షన్లలో రూ. 370 స్ట్రయిక్ వద్ద ఇంకా 13.19 లక్షల షేర్ల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వుంది. ఇక రూ. 350, రూ. 340 స్ట్రయిక్స్ వద్ద జరిగిన పుట్ రైటింగ్ కారణంగా 4.08 లక్షలు, 211 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ పుట్ ఆప్షన్లలో మొత్తం ఓఐ 16.37 లక్షలు, 18.32 లక్షలకు చేరింది. సమీప భవిష్యత్తులో టాటా స్టీల్‌కు రూ. 340-350 శ్రేణి వద్ద గట్టి మద్దతు లభించవచ్చని, ఈ మద్దతుసాయంతో క్రమేపీ రూ. 370 స్థాయిని చేరవచ్చని ఈ ఆప్షన్ డేటా సూచిస్తున్నది.