
ప్రత్యేక కంపెనీగా బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల విభాగం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల వ్యాపార విభాగాన్ని విడగొట్టి, ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అలాగే 800 మెగాహెట్జ్ సీడీఎంఏ స్పెక్ట్రంను వాపసు చేసినందుకు గాను బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఎంటీఎన్‌ఎల్‌కు రూ. 627.20 కోట్లు పరిహారం ఇచ్చేందుకూ ఆమోదముద్ర వేసింది. ఆర్థిక సమస్యల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు టవర్ల వ్యాపార విభజన తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ల వ్యాపార సంస్థ స్వరూపం, విధివిధానాలకు సంబంధించి టెలికం విభాగం... అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేబినెట్ పరిశీలిస్తుందని వివరించాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 64,500 టవర్లు ఉన్నాయి. దీని ప్రకారం టవర్ కంపెనీ వేల్యుయేషన్ రూ. 20,000 కోట్ల పైగా ఉంటుందని అంచనా.