ఆరోగ్యశ్రీ రథం... ఆ‘కర్షక’ ధ్వజం.. గెలుపే లక్ష్యం! | Budget highlights | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ రథం... ఆ‘కర్షక’ ధ్వజం.. గెలుపే లక్ష్యం!

Published Fri, Feb 2 2018 2:06 AM | Last Updated on Fri, Feb 2 2018 4:55 AM

Budget highlights - Sakshi

అది మహా భారతం. కురుక్షేత్ర సంగ్రామం. అస్త్రాలు సంధించేది అర్జునుడే అయినా... దేనినెప్పుడు సంధించాలో... దేనినెలా ఎదుర్కోవాలో... ఎప్పుడు ఏ మాయ చేయాలో అన్నీ తెలిసినవాడు శ్రీ కృష్ణుడు. అర్జునుడి రథానికే కాదు, యావద్భారత సంగ్రామానికీ తనే సారథి. కర్ణుడిపైకి అంజలీకాన్ని సంధించినా... బ్రహ్మాస్త్రాన్ని వదిలి వెనక్కు తీసుకున్నా... సమ్మోహనాన్ని ప్రయోగించినా... జయద్రథుడిపైకి పాశుపతాన్ని పంపినా... అర్జునుడి గాండీవానికి కృష్ణుడే మార్గదర్శి.

మన భారతంలో... మరో ఏడాదిలో ఎదుర్కోవాల్సిన ఎన్నికల కురుక్షేత్రానికి శంఖారావం పూరించారు నరేంద్రమోదీ. ప్రధానిగా యావద్భారతాన్నీ నడిపిస్తున్న మోదీ.. బడ్జెట్‌ రథ సారథిగా అరుణ్‌ జైట్లీకి శక్తిమంతమైన అస్త్రాలనందించారు. ఏకంగా 50 కోట్ల మందిని సమ్మోహితుల్ని చేసే ఆరోగ్య బీమాస్త్రం... పాశుపతంలాంటిదే.10 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఉచిత ఆరోగ్య బీమా కల్పించటం దీని లక్ష్యం. ఒకరకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ లాంటిదే ఇది కూడా. ఇపుడు దేశవ్యాప్తం కాబోతోంది!!

ఆహార భారతానికి వెన్నెముకయిన రైతును ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఆ‘కర్షక’అస్త్రం వేశారు జైట్లీ. ఖరీఫ్‌ పంటల కోసం రైతులు వెచ్చించే పెట్టుబడి వ్యయానికి 50% ఎక్కువగా కనీస మద్దతు ధరనిస్తామన్నారు. వేతన జీవులకు ఆదాయపు పన్ను శ్లాబులు మార్చకుండా నిరాశ కలిగించినా... రూ.40 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌తో ఆశపెట్టారు. మొత్తంగా చూస్తే... ఇది ఎన్నికల కురుక్షేత్రానికి శంఖారావం పూరించిన బడ్జెట్‌ రథం. కాకపోతే మన భారతంలో కురుక్షేత్రం ఐదేళ్లకోసారి జరుగుతుంది. అందులో గెలుపోటములే... అంతిమంగా జనం చేతిలోని అస్త్రాలు.  

పెరిగేవి..
కార్లు, మోటార్‌ సైకిళ్లు, బస్సులు, ట్రక్కుల రేడియల్‌ టైర్లు, మొబైల్‌ ఫోన్లు, వాటి యాక్సెసరీలు, ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ టీవీ ప్యానెళ్లు, ఇతర టీవీ విడిభాగాలు, ధరించగలిగిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు, పెర్ఫ్యూమ్‌లు, డియోడ్రంట్లు, టాయిలెట్‌ వాటర్, టాయిలెట్‌ స్ప్రేలు, సౌందర్య ఉత్పత్తులు, పాదరక్షలు, పట్టు వస్త్రాలు, రంగు రాళ్లు, కొన్ని రకాల వజ్రాలు, పండ్లు, కూరగాయల జ్యూస్‌లు, వంటనూనెలు, బంగారం, వెండి, సన్‌గ్లాసెస్, సన్‌స్క్రీన్, సన్‌ట్యాన్‌ లోషన్లు, మ్యానిక్యూర్, పెడిక్యూర్‌లలో వాడే పదార్థాలు..

తగ్గేవి
ముడి జీడిపప్పు, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ల తయారీలో వాడే పరికరాలు, సౌర ఫలకాల తయారీలో వాడే సోలార్‌ టెంపర్డ్‌ గ్లాస్‌లు, కొన్ని రకాల మేకులు  

బడ్జెట్‌ హైలైట్స్‌
వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులు, రేట్లలో మార్పు లేదు
కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పశు, చేపల పెంపకందారులకిస్తారు.
2018 ఆర్థిక సంవత్సరం చివరి 6 నెలల్లో 7.2–7.5% వృద్ధి రేటు నమోదు కావొచ్చు.
2017–18కి సవరించిన ద్రవ్యలోటు అంచనా 5.95 లక్షల కోట్లు. జీడీపీలో ఇది 3.5%.
దశాబ్దం తర్వాత మళ్లీ స్టాండర్డ్‌ డిడక్షన్‌ అమలు. వేతన ఉద్యోగులకు రూ.40 వేల వరకు ప్రయాణ, వైద్య ఖర్చులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ వర్తింపు.
రూ.50 లక్షలు మించి రూ.కోటికి తక్కువ ఆదాయం ఉన్న వారిపై 10%, రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 15% సర్‌చార్జ్‌ కొనసాగింపు.
2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.11 లక్షల కోట్ల మేర పంట రుణాల మంజూరు లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.10 లక్షల కోట్లే.
అన్ని రంగాల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే ఈపీఎఫ్‌ను 12 శాతానికి పెంచారు. ఇది మూడేళ్ల పాటు అమలవుతుంది.
రాష్ట్రపతి గౌరవ వేతనం నెలకు రూ. 5లక్షలకు పెంపు. ఉపరాష్ట్రపతి గౌరవ వేతనం రూ.4 లక్షలకు, గవర్నర్ల గౌరవ వేతనం
రూ. 3.5 లక్షలకు పెంపు. 
మొబైల్‌ ఫోన్ల దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంపు. టీవీలకు సంబంధించి కొన్ని విడిభాగాలపై కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి పెంపు.
దేశంలో 10 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికింద ఒక్కో కుటుంబానికి గరిష్టంగా ఏటా రూ. 5 లక్షల వైద్య బీమా
సదుపాయం కల్పిస్తారు.

ఈసారి బడ్జెట్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య బీమా పథకాన్ని జైట్లీ ప్రకటించారు. ఎందుకంటే 10 కోట్ల పేద కుటుంబాలు.. అంటే దాదాపు 50 కోట్ల మందికి వర్తించేలా ఏడాదికి రూ.5 లక్షల కవరేజీతో ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తెస్తామని జైట్లీ ప్రకటించారు. గురువారం 2018–19 బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పిస్తూ.. ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనేది, ప్రత్యేకంగా కేటాయింపులెంతనేది వెల్లడించలేదు. మొత్తంగా ఆరోగ్యం, విద్య, సామాజిక పరిరక్షణకు రూ.1.38 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనాభాలో 40 శాతం మందిని ఆకర్షించే ప్రయత్నం చేశారన్నది నిపుణుల మాట. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధి.

వ్యవసాయానికి పెద్ద పీట!
ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి, గ్రామీణ భారతానికి పెద్ద పీట వేశారు జైట్లీ. ‘‘నవ భారత నిర్మాణానికి ఇదే చోదకం’’ అని బడ్జెట్‌ అనంతరం జైట్లీ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ రంగాలకిచ్చిన ప్రాధాన్యం అర్థమవుతుంది. పంట చేతికొచ్చినపుడు సరైన ధర లేక... సరైన ధర ఉన్నపుడు చేతిలో పంట లేక రైతులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించిన జైట్లీ... పంటల నిల్వకోసం ఉచితంగా గిడ్డంగుల సౌకర్యం కల్పించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

అంతేకాక కనీస మద్దతు ధర నిర్ణయించేటపుడు రైతు పెట్టుబడిని పరిగణనలోకి తీసుకుంటామని, పెట్టుబడికన్నా కనీసం 50 శాతం అధికంగా ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తామని తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.2000 కోట్లివ్వటం, కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల్ని మత్స్య, పశు సంవర్థక రైతులకూ వర్తింపజేయటం... ఇవన్నీ రైతాంగానికిచ్చిన వరాలేనని చెప్పాలి.


సీనియర్‌ సిటిజన్లకు ఊరటే!
సంపాదించినన్నాళ్లూ పొదుపు చేసుకుని... రిటైరయ్యాక బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీయే ఆదాయంగా బతుకుతున్న వారు కోకొల్లలు. ఎందుకంటే అసంఘటిత రంగమే అత్యధిక ఉద్యోగుల్ని పోషిస్తున్న మన భారతంలో పింఛన్‌ వచ్చేది అతితక్కువ మందికే. అందుకేనేమో.. డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.10 వేలు దాటితే పన్ను చెల్లించాల్సిన పరిస్థితిని తప్పించి.. ఆ మొత్తాన్ని రూ.50వేలకు పెంచారు. వారు వైద్య అవసరాల కోసం (క్రిటికల్‌ ఇల్‌నెస్‌) వెచ్చించే దాంట్లో పన్ను మినహాయింపునకు అర్హమయ్యే మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు కూడా.

వేతన జీవికి విదిలింపే!
ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారని అంతా ఎదురు చూసినా... ఈసారి జైట్లీ వాటి జోలికెళ్లలేదు. అయితే అందరికీ వర్తించేలా రూ.40 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ను అమల్లోకి తెస్తామని ప్రకటించారు. అంటే ప్రతి ఒక్కరికీ పన్ను ఆదాయంలో ఎలాంటి బిల్లులూ లేకుండా రూ.40 వేలను మినహాయిస్తారన్న మాట. అయితే అదే సమయంలో ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిధిలో ఉన్న రవాణా భత్యాన్ని, వైద్య ఖర్చుల్ని దాన్నుంచి తొలగించారు.

పైపెచ్చు ప్రస్తుతం పన్ను ఆదాయంపై విధిస్తున్న 3 శాతం విద్యా సెస్సును 4 శాతానికి పెంచారు. అంటే మొత్తంగా చూసినపుడు స్టాండర్డ్‌ డిడక్షన్‌ వల్ల లాభం పరిమితమేనని చెప్పాలి. అలాగే షేర్లపై వచ్చే లాభానికి ప్రస్తుతం ఏడాది దాటితే పన్ను లేదు. కానీ లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పేరిట దీన్ని జైట్లీ అమల్లోకి తెచ్చారు. కాకపోతే దీనికి కొన్ని పరిమితులు విధించడం కొంత ఊరట. ఈక్విటీ మ్యూచ్‌వల్‌ ఫండ్లు చెల్లించే డివిడెండ్లపైనా 10 శాతం పన్ను వేశారు.

లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌
షేర్లను కొని, ఏడాదికన్నా ఎక్కువకాలం వాటిని అట్టేపెట్టుకుంటే వాటిపై వచ్చే లాభాలపై లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను ఉండదు. ఏడాదిలోపు విక్రయిస్తే మాత్రం షార్ట్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ కింద పన్నుంటుంది. నిజానికి పద్నాలుగేళ్ల కిందట లాం గ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును తొలగించారు. దాన్ని జైట్లీ మళ్లీ తెచ్చారు. రూ.లక్షకు మించి వచ్చిన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తామని చెప్పారు. నిజానికి 2004 జూలైలో లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్నును తొలగించి... దాని స్థానంలో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ను తెచ్చారు. ఇప్పుడు రెండూ అమల్లో ఉండటం గమనార్హం.

గ్రామీణులకు వరాలు
నిరుపేదలకు ఉచితంగా ఇస్తున్న గ్యాస్‌ కనెక్షన్ల లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తుతమున్న 5 కోట్ల నుంచి 8 కోట్లకు పెంచారు. దీనికితోడు 4 కోట్ల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయం, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, ఆర్గానిక్‌ వ్యవసాయం, పశు సంవర్థకం, మత్స్య పరిశ్రమ వంటి వాటికి జైట్లీ ఏకంగా రూ.14.34 లక్షల కోట్లు కేటాయించారు.

దిగుమతి సుంకాల పెంపు!
మిగిలిన పన్నులన్నీ జీఎస్‌టీ పరిధిలోకి వచ్చి ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతుండటంతో ఈ సారి వాటిలోకి ప్రవేశించే అవకాశం జైట్లీకి రాలేదు. దీంతో దిగుమతి సుంకాలను పెంచేశారు. సెల్‌ఫోన్లు, అత్తర్లు, ముస్తాబు సామగ్రి (టాయ్‌లెట్రీ), వాచ్‌లు, ఆటోమొబైల్‌ భాగాలు, సన్‌గ్లాసులు, ట్రక్‌–బస్సు టైర్లు వంటి వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేశారు.

ద్రవ్య నియంత్రణ కష్టమేనా
విద్య, ఆరోగ్యాలకు రూ.1.38 లక్షల కోట్లను ప్రకటించిన జైట్లీ... ఈ ఏడాది ద్రవ్యలోటు ముందుగా అంచనా వేసినట్టుగా జీడీపీలో 3.2 శాతంగా కాకుండా 3.5 శాతంగా ఉండవచ్చని స్పష్టంచేశారు. 2018–19లో ఇది 3.3 శాతానికి చేరుకోవచ్చన్నారు.

కార్పొరేట్‌ ట్యాక్స్‌ ఊరట కొందరికే
కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలన్న డిమాండ్‌పై జైట్లీ కొందరికే ఊరటనిచ్చారు. ప్రస్తుతం రూ.50 కోట్ల వరకూ వార్షిక టర్నోవర్‌ ఉన్న సంస్థలకు ఈ వెసులుబాటు ఉండగా.. ఇకపై రూ.250 కోట్ల టర్నోవర్‌ చేసే సంస్థలకు కూడా వర్తింపజేశారు.

అంపశయ్యపై ఉండి కూడా... రాజ్యపాలన రీతులు, లోతులు, ధర్మ సూక్ష్మాలు తదితరాలను ధర్మజుడికి, పాండవులకు తన అనుభవాన్నంతా రంగరించి వివరిస్తాడు భీష్ముడు. ప్రజా సంక్షేమమే పరమావధి అంటాడు. ధర్మనందనుడి పాలనకు ఒకరకంగా అవే శిలాక్షరాలు. అందుకేనేమో సంక్షేమ మంత్రాన్ని పఠిస్తూ అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు జైట్లీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement