వారెన్ బఫెట్
2.1 బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ గురు
వెల్త్-ఎక్స్ టాప్ 10లో అగ్రస్థానం
న్యూఢిల్లీ: వివిధ కార్యక్రమాల కోసం ఈ ఏడాది అత్యధికంగా విరాళాలిచ్చిన దాతల్లో ఇన్వెస్ట్‌మెంట్ గురు వారెన్ బఫెట్ అగ్రస్థానంలో నిల్చారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఏకంగా 2.1 బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. తన కంపెనీ బెర్క్‌షైర్ హాథ్‌వేలోని 16.6 మిలియన్ షేర్ల రూపంలో ఇది ఇచ్చారు. వెల్త్-ఎక్స్ సంస్థ రూపొందించిన 10 మంది దాతల జాబితాలో బఫెట్ ఈ విధంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ లిస్టులోని 10 మందిలో 8 మంది అమెరికన్ దాతలే.
హాంకాంగ్‌కి చెందిన రియల్టీ దిగ్గజాలు రోనీ, జెరాల్డ్ చాన్‌లు మాత్రమే అమెరికాయేతరులు. సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్‌కి 497.5 మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడం ద్వారా గోప్రో సంస్థ వ్యవస్థాపకుడు నికొలస్ ఉడ్‌మ్యాన్ దంపతులు రెండో స్థానంలో ఉన్నారు. రోనీ.. జెరాల్డ్ చాన్ వరుసగా 3,4 స్థానాల్లో ఉన్నారు. ఈ ఇద్దరు సోదరులు హార్వర్డ్ యూనివర్సిటీకి 350 మిలియన్ డాలర్లు ఇచ్చారు. 2014 టాప్ టెన్ విరాళాల్లో ఆరింటిని విద్యా సంస్థలు దక్కించుకున్నాయి.