
గ్యాస్ ధరకు కొత్త ఫార్ములా
దేశీ చమురు, గ్యాస్ రంగ వృద్ధికి తోడ్పడేలా కేంద్రం మరిన్ని సంస్కరణలు ప్రకటించింది.
♦ చమురు, గ్యాస్ రంగంలో సంస్కరణలు
♦ మైనింగ్ చట్టాల్లో సవరణలు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశీ చమురు, గ్యాస్ రంగ వృద్ధికి తోడ్పడేలా కేంద్రం మరిన్ని సంస్కరణలు ప్రకటించింది. కఠిన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన క్షేత్రాల్లో గ్యాస్ వెలికితీతను ప్రోత్సహించేలా కొన్ని పరిమితులతో కొత్త ధరల విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గిట్టుబాటు ధర లేనందువల్ల వదిలేసిన దాదాపు రూ. 1.80 లక్షల కోట్ల విలువ చేసే గ్యాస్‌ను వెలికితీసేందుకు ఇది ఉపయోగపడనుంది. అటు మైనింగ్ సంస్థలు మరిన్ని అసెట్స్‌ను సులువుగా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తూ సంబంధిత చట్టాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, భవిష్యత్‌లో నిర్వహించే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి సంబంధించి వివాదాస్పదమైన ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్‌సీ)స్థానంలో ఆదాయ పంపక ఒప్పందాన్ని కూడా ఓకే చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గురువారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది.
కొత్త ఫార్ములాతో కఠిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేట్లు 85 శాతం మేర ఎగియనున్నాయి. ప్రస్తుత ధరల ప్రాతిపదికన చూస్తే యూనిట్ (ఎంబీటీయూ) ధర 7.08 డాలర్లకు పెరగనుంది. వివాదాల్లో ఉన్న క్షేత్రాలకు ఇది వర్తించదు. సుమారు 28 క్షేత్రాల్లోని 6.75 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్‌ను వెలికితీయడానికి కొత్త ధర ఉపయోగపడగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం భారత్ రోజుకు 90 మిలియన్ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. ఇది దేశీయవసరాల్లో సుమారు నలభై శాతానికి కూడా సరిపోవడం లేదు. కొత్తగా మిగతా క్షేత్రాలు అందుబాటులోకి వస్తే మరో 15 ఏళ్ల పాటు రోజుకు అదనంగా 35 ఎంసీఎండీ మేర గ్యాస్ ఉత్పత్తి జతవుతుందని ప్రధాన్ పేర్కొన్నారు.
ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్, జీఎస్‌పీసీకి ప్రయోజనం..
తాజా ఫార్ములాతో అత్యధిక ఒత్తిడి, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల నుంచి, అత్యంత లోతైన సముద్రగర్భాల నుంచి వెలికి తీసే గ్యాస్‌కు ధరను నిర్ణయించుకునేందుకు ఓఎన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, జీఎస్‌పీసీలకు స్వేచ్ఛ లభిస్తుంది. అయితే, ఈ రేటుకూ ఒక పరిమితిని నిర్దేశించింది ప్రభుత్వం. దీని ప్రకారం దిగుమతి చేసుకున్న ఫ్యుయల్ ఆయిల్, బొగ్గు, నాఫ్తా మొదలైన వాటి ఏడాది సగటు ధర కన్నా.. ఈ రేటు తక్కువగానే ఉండాలి. 2015లో సగటు ఇంధన రేట్లను బట్టి చూస్తే యూనిట్ ధర సగటున 7.08 డాలర్లవుతుంది. కొత్త ధరల మార్గదర్శకాలు ఈ ఏడాది జనవరి 1 నాటికి ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాని నిక్షేపాలకు వర్తిస్తాయి.
వివాదాల్లోని గ్యాస్ క్షేత్రాలకు .. సదరు వివాదం పరిష్కారమయ్యే దాకా కొత్త ఫార్ములా వర్తించదు. కేజీ-డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్-1, 3 గ్యాస్ క్షేత్రాల గ్యాస్‌కు అధిక రేటు కోరుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో తాజా ఫార్ములా నిబంధనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రిలయన్స్‌కి చెందిన కేజీ-డీ6 బ్లాకులో దాదాపు డజను పైగా నిక్షేపాలు, పొరుగునే ఉన్న కేజీ-డీ5లో ఓఎన్‌జీసీవి దాదాపు 6-7 నిక్షేపాలు, జీఎస్‌పీసీకి చెందిన కేజీ-ఓఎస్‌ఎన్-2001/3కి చెందిన మరికొన్ని నిక్షేపాల్లో ఇంకా గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉంది.
మరిన్ని వివరాలు..
♦ ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరేలా బిడ్లు వేసే సంస్థలకు.. అన్ని రకాల హైడ్రోకార్బన్ల వెలికితీత, ఉత్పత్తికి ఏకీకృత లెసైన్స్ లభిస్తుంది.
♦ బ్రిటన్ సంస్థ బీజీ గ్రూప్‌నకు చెందిన పన్నా/ముక్తా తపతి వంటి చిన్న, మధ్య తరహా క్షేత్రాల లెసైన్సు గడువును పదేళ్ల పాటు పొడిగించారు. ఇందుకోసం కొన్ని నిబంధనలు మార్చారు. అయితే, కెయిర్న్ ఇండియాకు చెందిన రాజస్తాన్ బ్లాక్ లెసైన్సు గడువు పెంపు ప్రస్తావించలేదు.
♦ వేలం ద్వారా కాకుండా కంపెనీలు కేటాయింపుల మార్గంలో దక్కించుకున్న ఖనిజ గనులను విక్రయించుకునేందుకు, విలీనాలు.. కొనుగోళ్లకు వీలు కల్పిస్తూ మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) 1957 చట్టానికి సవరణలను క్యాబినెట్ ఆమోదించింది.