న్యూఢిల్లీ : విమానయాన సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వినియోగదారులను అధిక చార్జీలతో బాదేస్తున్న సంస్థలపై కేంద్రం స్పందించింది. విమాన ప్రయాణికులకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ద్వారా విమాన టికెట్ క్యాన్సిలేషన్, లగేజి చార్జీలపై ఊరట కల్పించింది. టిక్కెట్ రద్దు చార్జీలు, పరిమిత లగేజి అనంతరం వసూలు చేస్తున్న ఛార్జీలపై కూడా కోత పెడుతూ విమాన సంస్థలకు కొత్త నిబంధనలు విధించింది. ఈ కొత్త నిబంధనలను విమానయాన శాఖా మంత్రి అశోక గజపతిరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు.
టికెట్ క్యాన్సిలేషన్ సమయంలో టిక్కెట్ బేస్ ధర కంటే రద్దు ఛార్జీలు అధికంగా ఉండకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే టికెట్ రద్దుచేసుకున్న 15 రోజుల్లోగా రిఫండ్ చేయాలని పేర్కొంది. నగదు వాపసు పొందవచ్చు లేదా ఆ మొత్తాన్ని తదుపరి ప్రయాణ అవసరాలకోసం క్రెడిట్ చేసుకునే నిర్ణయం ప్రయాణీకులదే.అన్నిరకాల పన్నులు, లెవీ, యూజర్ చార్జీలను తిరిగి చెల్లించాలని కోరింది. 15 కేజీల లగేజీ దాటితే అదనంగా ఐదు కేజీల వరరూ 100 రూ.కు మించి వసూలు చేయకూడదని కేంద్ర ఆదేశించింది. ఓవర్ బుకింగ్ అయిన పక్షంలో ప్రయాణీకుడికి 20 వేల రూపాయలను పరిహారంగా చెల్లించాలని తెలిపింది. 24 గంటల్లోపు విమానం రద్దయితే 10వేల పరిహారం చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ లైన్ పోర్టల్స్, ఎయిర్ లైన్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రమోషనల్, స్పెషల్ రేట్లలో కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించారు.
కాగాఇటీవల టిక్కెట్ రద్దు చార్జీలు బేస్ ధర కంటే ఎక్కువగా వసూలు చేసిన ఈ ఛార్జీలను వెంటనే కస్టమర్లకు చెల్లించాలని విమాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. టిక్కెట్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటం వల్ల, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు ప్రయాణికులు నష్టపోతున్నారన్నారు. సర్వీసు పన్నులను, ఇతర ఎయిర్ పోర్టు ఛార్జీలను ప్రయాణికులు టిక్కెట్ ధరల్లోనే విమాన సంస్థలకు చెల్లిస్తుంటారని, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు వీటిని అసలు లెక్కలోకే తీసుకోవడంలేది, టికెట్ రద్దు చార్జీలు క్రమేపీ పెరుగుతూ పోతున్నాయని.. వీటిని అదుపులో ఉంచడానికి అథారిటీ ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇవి న్యాయసంబంధమైన విషయాలకు కిందకు వస్తాయని తెలిపారు.