అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారనున్న అంచనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. దేశీ స్టాక్ మార్కెట్లు సైతం అమ్మకాలతో డీలాపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 492 పాయింట్లు పతనమై 33,046కు చేరగా.. నిఫ్టీ 141 పాయింట్లు క్షీణించి 9,761 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హెల్త్‌కేర్ రంగ కంపెనీ క్యాప్లిన్ పాయింట్, అగ్రి కెమికల్స్ కంపెనీ ధనూకా అగ్రిటెక్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్
ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇంజక్షన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతి లభించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ పేర్కొంది. ఏడాది కాలంలో ఈ ఔషధానికి 4.5 కోట్ల డాలర్ల మార్కెట్ నమోదైనట్లు తెలుస్తోంది. అనుబంధ సంస్థ క్యాప్లిన్ స్టెరైల్స్ ద్వారా క్యాప్లిన్ పాయింట్ 17 ఏఎన్‌డీఏలకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో క్యాప్లిన్ పాయింట్ షేరు దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 371 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 383 వరకూ ఎగసింది.
ధనూకా అగ్రిటెక్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో అగ్రికెమికల్స్ కంపెనీ ధనూకా అగ్రిటెక్ కౌంటర్ ర్యాలీ బాటలో సాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 667ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 652 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు రోజుల్లోనూ ఈ షేరు 15 శాతం లాభపడింది. క్యూ4(జనవరి-మార్చి)లో ధనూకా నిర్వహణ లాభం(ఇబిటా) 39 శాతం ఎగసి రూ. 46 కోట్లకు చేరగా.. మార్జిన్లు 17.14 శాతం నుంచి 20.11 శాతానికి బలపడ్డాయి. మొత్తం ఆదాయం సైతం 18 శాతం పెరిగి రూ. 228 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment