
ముంబై: సస్య సంరక్షణ ఉత్పత్తులను అందించే యూపీఎల్ మార్చి త్రైమాసికానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలు కలిపి) నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం తగ్గి రూ.792 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.1,379 కోట్లుగా ఉండడం గమనార్హం.
ఆదాయం 5 శాతం పెరిగి క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.15,861 కోట్ల నుంచి రూ.16,569 కోట్లకు వృద్ధి చెందింది. 2022–23 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ఆదాయం 16 శాతం పెరిగి రూ.53,576 కోట్లుగా నమోదైంది.
నికర లాభం పెద్దగా వృద్ధి లేకుండా రూ.4,437 కోట్ల నుంచి రూ.4414 కోట్లకు చేరింది. ఒక్కో షేరుకు రూ.10 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ బోర్డ్ సిఫారసు చేసింది. గత త్రైమాసికంలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్టు యూపీఎల్ సీఈవో మైక్ ఫ్రాంక్ తెలిపారు. ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం, సాగు సీజన్ ఆలస్యం కావడం లాభాలపై ప్రభావం చూపించినట్టు చెప్పారు. స్థూల రుణ భారం 600 మిలియన్ డాలర్లు మేర, నికర రుణ భారం 440 మిలియన్ డాలర్ల మేర తగ్గించుకున్నట్టు ప్రకటించారు. 2023–24లో మార్కెట్ అవరోధాలను అధిగమించి, లాభాల్లో మెరుగైన వృద్ధి నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment