జూలై.. కారు రయ్‌! | Car Sales July 2017: Carmakers Show Strong Growth Post GST | Sakshi
Sakshi News home page

జూలై.. కారు రయ్‌!

Published Wed, Aug 2 2017 12:27 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

జూలై.. కారు రయ్‌! - Sakshi

జూలై.. కారు రయ్‌!

వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి ∙
మారుతీ అమ్మకాలు 22% జూమ్‌ ∙
వాణిజ్య, టూవీలర్‌ విభాగాల్లో నూ ఇదే జోరు   


న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్‌ వాహన విక్రయాల్లో జూలై నెలలో బలమైన వృద్ధి నమోదయ్యింది. దీనికి జీఎస్‌టీ అమలు, ధరల తగ్గింపు, సానుకూల రుతుపవనాలు వంటి పలు అంశాలు కారణంగా నిలిచాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా, ఫోర్డ్‌ ఇండియా, హోండా కార్స్‌ ఇండియా వంటి కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయింది. జీఎస్‌టీ అమలు తర్వాత కస్టమర్ల కొనుగోలు సెంటిమెంట్‌ మెరుగుపడిందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసెంజర్‌ వెహికల్స్‌ విభాగం) మాయంక్‌ పరీఖ్‌ తెలిపారు.

జీఎస్‌టీ వల్ల రానున్న కాలంలో స్వల్పకాలిక ఒడిదుడుకులు ఉండొచ్చని, ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగొచ్చని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే జీఎస్‌టీ ధరల తగ్గింపు, పండుగ సీజన్, తక్కువ వడ్డీ రేట్లు, సానుకూల రుతుపవనాల వంటివి పరిశ్రమకు సానుకూల అంశాలని తెలిపారు. హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యూచిరో యుయినో కూడా ఇదే అంశాన్ని వ్యక్తీకరించారు. జీఎస్‌టీని విజయవంతంగా అమలు చేయడం, రుతుపవనాలు, అందుబాటు వడ్డీ రేట్ల వల్ల బలమైన విక్రయాల వృద్ధి సాధించామని మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ విభాగం) రాజన్‌ వడేరా తెలిపారు. జీఎస్‌టీ ధరల తగ్గింపు, సానుకూల రుతు పవనాల వల్ల కస్టమర్ల కొనుగోలు సెంటిమెంట్‌ మెరుగుపడిందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌) రాకేశ్‌ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. వాహన కంపెనీల దేశీ విక్రయాలను పరిశీలిస్తే..

మారుతీ సుజుకీ విక్రయాల్లో 22.4 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 1,25,778 యూనిట్ల నుంచి 1,54,001 యూనిట్లకు ఎగశాయి.

టాటా మోటార్స్‌ వాహన అమ్మకాలు 10 శాతం వృద్ధితో 13,547 యూనిట్ల నుంచి 14,933 యూనిట్లకు పెరిగాయి.

ఫోర్డ్‌ ఇండియా విక్రయాలు 19 శాతం ఎగశాయి. ఇవి 7,076 యూనిట్ల నుంచి 8,418 యూనిట్లకు చేరాయి.

మహీంద్రా అమ్మకాలు 35,305 యూనిట్ల నుంచి 39,762 యూనిట్లకు పెరిగాయి. అంటే 13 శాతం వృద్ధి నమోదయ్యింది.

హోండా కార్స్‌ ఇండియా విక్రయాలు 22 శాతం వృద్ధితో 14,033 యూనిట్ల నుంచి 17,085 యూనిట్లకు పెరిగాయి.

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా అమ్మకాలు 4 శాతం పెరిగాయి. 41,201 యూనిట్ల నుంచి 43,007 యూనిట్లకు ఎగిశాయి.

వాణిజ్య వాహన విక్రయాల్లో 15 శాతం వృద్ధి
♦  టాటా మోటార్స్‌ దేశీ వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వృద్ధితో 27,842 యూనిట్లకు పెరిగాయి.

♦  అశోక్‌ లేల్యాండ్‌ మొత్తం విక్రయాలు 14 శాతం వృద్ధి చెందాయి. ఇవి 10,492 యూనిట్ల నుంచి 11,981 యూనిట్లకు పెరిగాయి.

టూవీలర్‌ విభాగంలోనూ జోష్‌
హీరో మోటొకార్ప్‌ విక్రయాలు 17 శాతం వృద్ధితో 5,32,113 యూనిట్ల నుంచి 6,23,269 యూనిట్లకు చేరాయి.

హోండా మోటార్‌సైకిల్‌ మొత్తం విక్రయాలు 20% పెరిగాయి. ఇవి 4,53,884 యూనిట్ల నుంచి 5,44,508 యూనిట్లకు ఎగశాయి.

టీవీఎస్‌ మోటార్‌ మొత్తం అమ్మకాలు 9 శాతం వృద్ధితో 2,48,002 యూనిట్ల నుంచి 2,71,171 యూనిట్లకు పెరిగాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొత్తం విక్రయాలు 21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 53,378 యూనిట్ల నుంచి 64,459 యూనిట్లకు ఎగిశాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement