Maruti sales
-
తగ్గేదేలే అంటున్న మారుతి సుజుకి - గత నెల అమ్మకాలు ఇలా!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత కొంతకాలంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు 2023 ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,60,529 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,39,519 యూనిట్లు కాగా.. 16,971 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 1,50,661 యూనిట్లు. మినీ సెగ్మెంట్ విభాగంలో మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. వీటి మొత్తం అమ్మకాలు 14,110 యూనిట్లు. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటివి ముందంజలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు 89,045 యూనిట్లు. ఇక ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సియాజ్ 1,017 యూనిట్ల అమ్మకాలను పొందింది. (ఇదీ చదవండి: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్‌వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?) మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ లో బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. ఈ కార్ల అమ్మకాలు ఏకంగా 90,062 యూనిట్లు. మొత్తం మీద మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో కూడా మంచి స్థాయిలో పెరిగాయి, రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
వాహన కంపెనీలకు ‘పండుగ’
న్యూఢిల్లీ: ఆటొమొబైల్ కంపెనీలు సెప్టెంబర్ మాసంలో మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కొనుగోళ్ల ఆసక్తి తోడవడంతో రెండంకెల వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్ ఏకంగా 25 శాతం అధిక విక్రయాలు జరిపింది. హ్యుందాయ్, హోండా మోటార్స్ కూడా రెండంకెల స్థాయిలో అమ్మకాల వృద్ధిని సాధించగా, కార్ల దిగ్గజం మారుతీ విక్రయాలు మాత్రం ఈ సారి ఒక అంకెకే పరిమితమయ్యాయి. మారుతి సుజుకి ఇండియా 1,63,071 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే మాసంలో విక్రయించిన 1,49,143 యూనిట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ విక్రయాలనే చూస్తే 10.3 శాతం పెరిగి 1,51,400 యూనిట్లుగా ఉన్నాయి. చిన్న కార్లు అయిన ఆల్టో, వ్యాగన్ఆర్ అమ్మకాలు 13.3 శాతం తగ్గాయి. గతేడాది సెప్టెంబర్‌లో 44.395 కార్లు అమ్మడుపోతే ఈ ఏడాది సెప్టెంబర్‌లో 38,479కి పరిమితం అయ్యాయి. అలాగే సియాజ్ అమ్మకాలు సైతం 14.4 శాతం తగ్గి 5,603 యూనిట్లుగా నమోదయ్యాయి. కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, ఎస్టిలో, డిజైర్, బాలెనో అమ్మకాలు 45 శాతం పెరగడం కలిసొచ్చింది. వీటి అమ్మకాలు 72,804 యూనిట్లుగా ఉన్నాయి. జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎస్‌క్రాస్, విటారా బ్రెజ్జా అమ్మకాలు 8 శాతం పెరిగి 19,900గా నమోదయ్యాయి. హోండా కార్స్ ఇండియా సైతం మెరుగైన పనితీరు చూపింది. సెప్టెంబర్‌లో 21 శాతం అధికంగా 18,257 కార్లను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన కార్ల సంఖ్య 15,304. జాజ్ అమ్మకాలు 3,001 యూనిట్లు, సెడాన్ అమేజ్ 2,561 యూనిట్లు, సెడాన్ సిటీ అమ్మకాలు 6,010 యూనిట్లుగా ఉన్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం డబ్ల్యూఆర్–వి కూడా 4,834 యూనిట్లు అమ్మడయ్యాయి. మారుతీ ఎస్‌క్రాస్ కొత్త వెర్షన్ మారుతీ సుజుకీ ఇండియా ఎస్యూవీ ఎస్క్రాస్లో నవీకరించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీనిలో నాలుగు రకాలు లభిస్తుండగా, వీటి ధరలు రూ.8.49 లక్షల నుంచి 11.29 లక్షలుగా(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్) ఉన్నాయి. వీటిలో పర్యావరణ అనుకూల డీడీఐఎస్200 ఇంజిన్ టెక్నాలజీని ప్రవేశపెట్టామని, దీనివల్ల కిలోమీటర్‌కు విడుదల చేసే ఉద్గారాలు 105.5 గ్రాములకు తగ్గించగలిగామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు. -
జూలై.. కారు రయ్!
♦ వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి ∙ ♦ మారుతీ అమ్మకాలు 22% జూమ్ ∙ ♦ వాణిజ్య, టూవీలర్ విభాగాల్లో నూ ఇదే జోరు న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్ వాహన విక్రయాల్లో జూలై నెలలో బలమైన వృద్ధి నమోదయ్యింది. దీనికి జీఎస్టీ అమలు, ధరల తగ్గింపు, సానుకూల రుతుపవనాలు వంటి పలు అంశాలు కారణంగా నిలిచాయి. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా, ఫోర్డ్ ఇండియా, హోండా కార్స్ ఇండియా వంటి కంపెనీల వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయింది. జీఎస్టీ అమలు తర్వాత కస్టమర్ల కొనుగోలు సెంటిమెంట్ మెరుగుపడిందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసెంజర్ వెహికల్స్ విభాగం) మాయంక్ పరీఖ్ తెలిపారు. జీఎస్టీ వల్ల రానున్న కాలంలో స్వల్పకాలిక ఒడిదుడుకులు ఉండొచ్చని, ఇన్పుట్ వ్యయాలు పెరగొచ్చని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అనురాగ్ మల్హోత్రా పేర్కొన్నారు. అయితే జీఎస్టీ ధరల తగ్గింపు, పండుగ సీజన్, తక్కువ వడ్డీ రేట్లు, సానుకూల రుతుపవనాల వంటివి పరిశ్రమకు సానుకూల అంశాలని తెలిపారు. హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యూచిరో యుయినో కూడా ఇదే అంశాన్ని వ్యక్తీకరించారు. జీఎస్టీని విజయవంతంగా అమలు చేయడం, రుతుపవనాలు, అందుబాటు వడ్డీ రేట్ల వల్ల బలమైన విక్రయాల వృద్ధి సాధించామని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వడేరా తెలిపారు. జీఎస్టీ ధరల తగ్గింపు, సానుకూల రుతు పవనాల వల్ల కస్టమర్ల కొనుగోలు సెంటిమెంట్ మెరుగుపడిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. వాహన కంపెనీల దేశీ విక్రయాలను పరిశీలిస్తే.. ♦ మారుతీ సుజుకీ విక్రయాల్లో 22.4 శాతం వృద్ధి కనిపించింది. ఇవి 1,25,778 యూనిట్ల నుంచి 1,54,001 యూనిట్లకు ఎగశాయి. ♦ టాటా మోటార్స్ వాహన అమ్మకాలు 10 శాతం వృద్ధితో 13,547 యూనిట్ల నుంచి 14,933 యూనిట్లకు పెరిగాయి. ♦ ఫోర్డ్ ఇండియా విక్రయాలు 19 శాతం ఎగశాయి. ఇవి 7,076 యూనిట్ల నుంచి 8,418 యూనిట్లకు చేరాయి. ♦ మహీంద్రా అమ్మకాలు 35,305 యూనిట్ల నుంచి 39,762 యూనిట్లకు పెరిగాయి. అంటే 13 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ హోండా కార్స్ ఇండియా విక్రయాలు 22 శాతం వృద్ధితో 14,033 యూనిట్ల నుంచి 17,085 యూనిట్లకు పెరిగాయి. ♦ హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 4 శాతం పెరిగాయి. 41,201 యూనిట్ల నుంచి 43,007 యూనిట్లకు ఎగిశాయి. వాణిజ్య వాహన విక్రయాల్లో 15 శాతం వృద్ధి ♦ టాటా మోటార్స్ దేశీ వాణిజ్య వాహన అమ్మకాలు 15 శాతం వృద్ధితో 27,842 యూనిట్లకు పెరిగాయి. ♦ అశోక్ లేల్యాండ్ మొత్తం విక్రయాలు 14 శాతం వృద్ధి చెందాయి. ఇవి 10,492 యూనిట్ల నుంచి 11,981 యూనిట్లకు పెరిగాయి. టూవీలర్ విభాగంలోనూ జోష్ ♦ హీరో మోటొకార్ప్ విక్రయాలు 17 శాతం వృద్ధితో 5,32,113 యూనిట్ల నుంచి 6,23,269 యూనిట్లకు చేరాయి. ♦ హోండా మోటార్‌సైకిల్ మొత్తం విక్రయాలు 20% పెరిగాయి. ఇవి 4,53,884 యూనిట్ల నుంచి 5,44,508 యూనిట్లకు ఎగశాయి. ♦ టీవీఎస్ మోటార్ మొత్తం అమ్మకాలు 9 శాతం వృద్ధితో 2,48,002 యూనిట్ల నుంచి 2,71,171 యూనిట్లకు పెరిగాయి. ♦ రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం విక్రయాలు 21 శాతం వృద్ధి చెందాయి. ఇవి 53,378 యూనిట్ల నుంచి 64,459 యూనిట్లకు ఎగిశాయి.