వాహన కంపెనీలకు ‘పండుగ’ | segments drives Tata Motors commercial | Sakshi
Sakshi News home page

వాహన కంపెనీలకు ‘పండుగ’

Published Mon, Oct 2 2017 2:30 AM | Last Updated on Mon, Oct 2 2017 1:20 PM

segments drives Tata Motors commercial

న్యూఢిల్లీ: ఆటొమొబైల్‌ కంపెనీలు సెప్టెంబర్‌ మాసంలో మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కొనుగోళ్ల ఆసక్తి తోడవడంతో రెండంకెల వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్‌ ఏకంగా 25 శాతం అధిక విక్రయాలు జరిపింది. హ్యుందాయ్, హోండా మోటార్స్‌ కూడా రెండంకెల స్థాయిలో అమ్మకాల వృద్ధిని సాధించగా, కార్ల దిగ్గజం మారుతీ విక్రయాలు మాత్రం ఈ సారి ఒక అంకెకే పరిమితమయ్యాయి. మారుతి సుజుకి ఇండియా 1,63,071 కార్లను విక్రయించింది.

గతేడాది ఇదే మాసంలో విక్రయించిన 1,49,143 యూనిట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి నెలకొంది. దేశీయ విక్రయాలనే చూస్తే 10.3 శాతం పెరిగి 1,51,400 యూనిట్లుగా ఉన్నాయి. చిన్న కార్లు అయిన ఆల్టో, వ్యాగన్‌ఆర్‌ అమ్మకాలు 13.3 శాతం తగ్గాయి. గతేడాది సెప్టెంబర్‌లో 44.395 కార్లు అమ్మడుపోతే ఈ ఏడాది సెప్టెంబర్‌లో 38,479కి పరిమితం అయ్యాయి. అలాగే సియాజ్‌ అమ్మకాలు సైతం 14.4 శాతం తగ్గి 5,603 యూనిట్లుగా నమోదయ్యాయి. కాంపాక్ట్‌ విభాగంలో స్విఫ్ట్, ఎస్టిలో, డిజైర్, బాలెనో అమ్మకాలు 45 శాతం పెరగడం కలిసొచ్చింది. వీటి అమ్మకాలు 72,804 యూనిట్లుగా ఉన్నాయి.

జిప్సీ, గ్రాండ్‌ విటారా, ఎర్టిగా, ఎస్‌క్రాస్, విటారా బ్రెజ్జా అమ్మకాలు 8 శాతం పెరిగి 19,900గా నమోదయ్యాయి. హోండా కార్స్‌ ఇండియా సైతం మెరుగైన పనితీరు చూపింది. సెప్టెంబర్‌లో 21 శాతం అధికంగా 18,257 కార్లను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన కార్ల సంఖ్య 15,304. జాజ్‌ అమ్మకాలు 3,001 యూనిట్లు, సెడాన్‌ అమేజ్‌ 2,561 యూనిట్లు, సెడాన్‌ సిటీ అమ్మకాలు 6,010 యూనిట్లుగా ఉన్నాయి. స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం డబ్ల్యూఆర్‌–వి కూడా 4,834 యూనిట్లు అమ్మడయ్యాయి.

మారుతీ ఎస్‌క్రాస్‌ కొత్త వెర్షన్‌
మారుతీ సుజుకీ ఇండియా ఎస్‌యూవీ ఎస్‌క్రాస్‌లో నవీకరించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీనిలో నాలుగు రకాలు లభిస్తుండగా, వీటి ధరలు రూ.8.49  లక్షల నుంచి 11.29 లక్షలుగా(ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్‌) ఉన్నాయి. వీటిలో పర్యావరణ అనుకూల డీడీఐఎస్‌200 ఇంజిన్‌ టెక్నాలజీని ప్రవేశపెట్టామని, దీనివల్ల కిలోమీటర్‌కు విడుదల చేసే ఉద్గారాలు 105.5 గ్రాములకు తగ్గించగలిగామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement