సిమెంట్ కంపెనీలకు సీసీఐ
రూ. 6,715 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కూటమి కట్టి, ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సిమెంట్ ధరలను తమ ఇష్టాను సారం నడిపించినందుకు 11 సిమెంట్ కంపెనీలకు, సిమెంటు తయారీదారుల సంఘాని(సీఎంఏ)కి రూ.6,715 కోట్ల మేర భారీ జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార విధానాల నిరోధక సంస్థ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు సైతం ఉన్నాయి. అన్ని సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు కాకుండా, ధరలు, ఉత్పత్తి, సరఫరాను నియంత్రించే చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచనల మేరకు సీసీఐ బుధవారం ఈ ఆదేశాలు వెలువరించింది. కంపెనీలు, సీఎంఏ అనుసరించిన వ్యవహార శైలి వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతకరమని సీసీఐ పేర్కొంది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాలకు కీలకమైన సిమెంట్ విషయంలో ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు అని వ్యాఖ్యానించింది. ‘సిమెంటు కంపెనీలు సీఎంఏ ప్లాట్ ఫామ్ ద్వారా ధరల వివరాలు, ఎంత మేర ఉత్పత్తి చేస్తుంది, సరఫరాల గురించి వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దాంతో ఉత్పత్తి, మార్కెట్లో సరఫరాలను నియంత్రించారు. సిమెంటు ధరలను నియంత్రించడం వ్యాపార పోటీ నిబంధనలకు విరుద్ధం’ అని సీసీఐ స్పష్టం చేసింది.
ఏ కంపెనీపై ఎంత..?: ఏసీసీపై రూ.1,147.59 కోట్లు, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (రూ.1,323.60 కోట్లు), అల్ట్రాటెక్ సిమెంట్ (రూ.1,175.49కోట్లు), సెంచురీ (రూ.274.02కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ.187.48కోట్లు), జేకే సిమెంట్స్ (రూ.128.54 కోట్లు), లఫార్జ్ (రూ.490 కోట్లు), రామ్‌కో రూ.258.63 కోట్లు), ఏసీఎల్ (రూ.1,163.91 కోట్లు), బినాని (రూ.167.32 కోట్లు), సీఎంఏపై రూ.0.73 కోట్ల జరిమానా భారం పడింది. అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు రూ.397.51 కోట్ల జరిమానా చెల్లించాలని శ్రీ సిమెంట్‌ను సీసీఐ ఆదేశించింది.