ముంబై : డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన భారీ కుంభకోణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎన్‌బీ స్కాంలో మరో సూత్రధారి అయిన నీరవ్ మేనమామ మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి గ్రూప్ కంపెనీలకు వ్యతిరేకంగా సీబీఐ బుధవారం మరో ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. ముంబైలోని స్పెషల్ సీబీఐ కోర్టులో ఈ ఛార్జ్‌షీటును నమోదుచేసినట్టు అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఈ కేసులో తొలి ఛార్జ్‌షీటును సీబీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీఎన్‌బీలో దాదాపు రూ.13వేల కోట్ల మేర కుంభకోణం జరిగినట్టు సీబీఐ తన ఛార్జ్‌షీటుల్లో పేర్కొంది. తొలుత దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో సీబీఐ పలు బ్యాంకు టాప్ అధికారుల పేర్లను ప్రస్తావించింది. దీనిలో పీఎన్‌బీ మాజీ చీఫ్ ఉషా సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.
పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేవీ బ్రహ్మాజీ రావు, సంజయ్ శరణ్, జనరల్ మేనేజర్(ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) నేహాల్ అహద్‌లను కూడా సీబీఐ తన తొలి ఛార్జ్‌షీటులో పేర్కొంది. ప్రస్తుతం నమోదు చేసిన ఛార్జ్‌షీటులో మెహుల్ చౌక్సి, ఆయన గీతాంజలి సంస్థలను చేర్చింది. తొలి ఛార్జ్‌షీటు దాఖలైన మరుసటి రోజే పీఎన్‌బీ తన నాలుగో క్వార్టర్‌లో భారీగా రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఇప్పటి వరకు పోస్టు చేసిన ఫలితాల్లో ఇదే అత్యధిక నష్టంగా విశ్లేషకులు పేర్కొన్నారు.
కాగా, పీఎన్‌బీ భారీ కుంభకోణాన్ని విచారిస్తున్న సీబీఐ తన తొలి ఎఫ్‌ఐఆర్‌ను జనవరి 31న నమోదు చేసింది. నీరవ్‌మోదీ, ఆయన భార్య, సోదరుడు నిషాల్, అంకుల్ మెహుల్ చౌక్సి, పలువురు పీఎన్‌బీఐ అధికారులకు వ్యతిరేకంగా అప్పట్లో ఈ ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది. వెంటనే మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లను కూడా సీబీఐ ఫైల్ చేసింది. తొలి ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా చేసుకుని సోమవారం సీబీఐ తన తొలి ఛార్జ్‌షీటును దాఖలు చేయగా.. రెండో ఎఫ్‌ఐఆర్ ఆధారితంగా నేడు రెండో ఛార్జ్‌షీటు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment