ఐడీబీఐ బ్యాంక్ అధికారులకు ఈడీ సమన్లు
ముంబై: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చె ందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఐడీబీఐ బ్యాంకుకు చెందిన అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. తమ తమ వ్యక్తిగత ఆర్థిక వివరాలు, గత ఐదేళ్ల ఐటీ రిటర్నులు మొదలైనవి విచారణ అధికారులకు సమర్పించాలని సూచించింది. మరికొద్ది రోజుల్లో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ముందుగా బ్యాంకు, కంపెనీ కీలక అధికారులను ప్రశ్నించిన తర్వాత మాల్యాకు సమన్లు జారీ చేసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి. సమన్లు జారీ అయిన వారిలో ఐడీబీఐ బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సీఎఫ్‌వో ఎ. రఘునాథన్ తదితరులు ఉన్నారు. ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ. 900 కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
లుక్‌అవుట్ నోటీసులు మార్చేసిన సీబీఐ..
మాల్యా దేశం విడిచి వెడితే ఆయన్ను నిర్బంధించాలంటూ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసుల్లో ఆదేశాలను నెలరోజుల వ్యవధిలో సీబీఐ మార్చేసింది. ఆయన రాకపోకల సమాచారం మాత్రమే తమకు అందిస్తే చాలని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్‌కు సూచించింది. తొలి లుక్‌అవుట్ నోటీసు గతేడాది అక్టోబర్ 16న జారీ అయింది. విచారణలో ఆయన పూర్తిగా సహకరిస్తున్నందునే ఆ తర్వాత దాన్ని మార్చినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. అందుకే తాజాగా ఆయన దేశం విడిచి వెడుతున్నా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకోలేదు.