సెల్‌కాన్ అసెంబ్లింగ్ ప్లాంట్ రెడీ.. | celkon Assembling Plant Ready | Sakshi
Sakshi News home page

సెల్‌కాన్ అసెంబ్లింగ్ ప్లాంట్ రెడీ..

Published Fri, Jun 12 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

సెల్‌కాన్ అసెంబ్లింగ్ ప్లాంట్ రెడీ..

సెల్‌కాన్ అసెంబ్లింగ్ ప్లాంట్ రెడీ..

మేడ్చల్ వద్ద ఏర్పాటు
వారంలో కేటీఆర్‌తో ప్రారంభం
సెల్‌కాన్ సీఎండీ వై. గురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
మొబైల్ ఫోన్ల రంగంలో ఉన్న సెల్‌కాన్.. హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద అసెంబ్లింగ్ ప్లాంట్‌ను స్థాపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో సెల్‌ఫోన్ల అసెంబ్లింగ్ ప్లాంటు నెలకొనడం ఇదే తొలిసారి. ప్లాంటులో నాలుగు లైన్లను ఏర్పాటు చేశారు. 10 రోజుల్లో మరో నాలుగు లైన్లు జోడిస్తారు. ఒక్కో లైన్లో 8 గంటల్లో 2,500 ఫోన్లు అసెంబుల్ చేయవచ్చు. తొలుత నెలకు 3 లక్షల ఫోన్లను అసెంబుల్ చేస్తామని సెల్‌కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు గురువారం తెలిపారు. దీనిని 10 లక్షల స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో శాశ్వత ప్లాంటు ఏర్పాటయ్యే వరకు మొబైల్ ఫోన్లను ఇక్కడే అసెంబుల్ చేస్తామని అన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చేతుల మీదుగా వారం రోజుల్లో ప్లాంటును ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

ఆర్‌అండ్‌డీ కూడా ఇక్కడే..
సెల్‌కాన్‌కు చైనాలోని షెంజెన్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే ఈ కేంద్రాన్ని ఇక్కడికి తరలిస్తామని గురు తెలిపారు. ‘50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు చేస్తాం. మొబైల్ ఫోన్ల డిజైనింగ్ ఇక్కడే చేపడతాం. 500 మంది నిపుణులు పనిచేసే అవకాశం ఉంది. రెండేళ్లలో పూర్తి స్థాయిలో తయారీని దేశీయంగా చేపట్టాలన్నది మా లక్ష్యం. ఇప్పటికే విడిభాగాల తయారీ కంపెనీలతో చర్చిస్తున్నాం. లక్ష్యానికి చేరువ కావడంలో మేడ్చల్  ప్లాంటు చుక్కానిగా నిలుస్తుంది’ అని అన్నారు. మానవ వనరులను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
 
త్వరలో స్మార్ట్‌ఫోన్లు సైతం..
ప్రస్తుతం నాలుగు బేసిక్ ఫోన్లను మేడ్చల్ ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. జూలై నుంచి స్మార్ట్‌ఫోన్లు కూడా తోడవనున్నాయి. మొత్తం ఏడు రకాల మోడళ్లు ఇక్కడ రూపొందనున్నాయి. సెల్‌కాన్ నెలకు 5 లక్షల సెల్‌ఫోన్లను విక్రయిస్తోంది. 2010లో ప్రస్థానాన్ని ప్రారంభించిన కంపెనీ భారత్‌తోపాటు 30 దేశాలకు విస్తరించింది. ప్లాంటు ఏర్పాటవడం ద్వారా కస్టమర్లకు సెల్‌కాన్ బ్రాండ్ మరింత దగ్గరవుతుందని టెక్నోవిజన్ ఎండీ సికందర్ వ్యాఖ్యానించారు. మొబైల్స్ హబ్‌లో నెలకు 10 లక్షల మొబైల్స్ తయారీ సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పనున్నట్టు సెల్‌కాన్ ఇప్పటికే ప్రకటించింది. కార్బన్‌తోపాటు మరో మూడు కంపెనీలు హబ్‌లో ప్లాంట్లు స్థాపించేందుకు సుముఖంగా ఉన్నాయి. హబ్ కార్యరూపం దాలిస్తే మరిన్ని కంపెనీలు ప్లాంట్లు పెట్టనున్నాయి. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో చర్చిస్తోంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement