నల్లకుబేరులు బయటికొచ్చారు | Centre names 3 black money account holders in affidavit to SC | Sakshi
Sakshi News home page

నల్లకుబేరులు బయటికొచ్చారు

Published Tue, Oct 28 2014 1:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

నల్లకుబేరులు బయటికొచ్చారు - Sakshi

నల్లకుబేరులు బయటికొచ్చారు

ఎనిమిది పేర్లను బయటపెట్టిన మోదీ ప్రభుత్వం
* సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో వెల్లడి...
* జాబితాలో డాబర్ ఇండియా ప్రమోటర్ కుటుంబీకుడు ప్రదీప్ బర్మన్
* బులియన్ ట్రేడర్ పంకజ్ చిమన్‌లాల్ లోధియా;
* గోవా మైనింగ్ సంస్థ టింబ్లో, ఐదుగురు డెరైక్టర్లు కూడా...

న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా నల్లధనం ఖాతాలున్నవారి పేర్లను మోదీ సర్కారు ఎట్టకేలకు బయటపెట్టింది.  సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్‌లో ఒక కంపెనీ సహా మొత్తం ఎనిమిది పేర్లను వెల్లడించింది.  విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీసే చర్యల్లోభాగంగా వీరిపై చట్టపరమైన విచారణ(ప్రాసిక్యూషన్) ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకు ఇచ్చిన 16 పేజీల అపిడవిట్‌లో ప్రధానంగా డాబర్ గ్రూపు ప్రమోటర్లలో ఒకరైన ప్రదీప్ బర్మన్ పేరు ఉంది. ఇంకా రాజ్‌కోట్‌కు చెందిన బులియన్ డీలర్ పంకజ్ చిమన్‌లాల్ లోధియా కూడా జాబితాలో ఉన్నారు.

గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు దాని అయిదుగురు డెరైక్టర్లను నల్ల కుబేరుల లిస్టులో కేంద్రం చేర్చింది. రాధా ఎస్ టింబ్లో, చేతన్ టింబ్లో, రోహన్ టింబ్లో, అన్నా టింబ్లో, మల్లికా టింబ్లో ఈ ఐదుగురు డెరైక్టర్లు. ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లభించిన సమాచారం ఆధారంగా బర్మన్‌పై ప్రాసిక్యూషన్‌ను మొదలుపెట్టామని.. మిగతావారిపై మాత్రం ఇతర దేశాల నుంచి సమాచారం అందినట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఆయా దేశాల పేర్లను మాత్రం ఆర్థిక శాఖ తన అఫిడవిట్‌లో వెల్లడించలేదు.  వీరిపై ఐటీ, మనీల్యాండరింగ్ చట్టంలోని పలు సెక్షన్లకింద నేరారోపణలు నమోదయ్యాయి.

అయితే, రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించవచ్చని భావిస్తున్న ఈ కేసులో మోదీ ప్రభుత్వం తొలిసారిగా వెలుగులోకితీసుకొచ్చిన వారంతా పారిశ్రామిక, వ్యాపారవేత్తలే కావడం గమనార్హం. నల్లకుబేరుల పేర్లను ప్రకటిస్తే.. కాంగ్రెస్ పార్టీలో కల్లోలం ఖాయమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవలే వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే, ఇలా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు వద్దని.. దమ్ముంటే పేర్లను ప్రకటించాలంటూ కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు సవాలు విసిరిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
మరిన్ని పేర్లను ప్రకటిస్తాం....
ఇదిలాఉంటే.. తమ దర్యాప్తులో నల్లధనం దాచుకున్నట్లు నిగ్గుతేలితే మరింత మంది నల్లకుబేరుల పేర్లను బయటపెడతామని కేంద్రం పేర్కొంది. విదేశాల్లో ఉన్న ఖాతాలన్నింటినీ అక్రమమైనవిగా చెప్పలేమని తేల్చిచెప్పింది. విదేశీ అకౌంట్ హోల్డర్ల పేర్లన్నింటితోపాటు విదేశాల నుంచి తమకు అందిన సమాచారాన్నంతా బయటికి వెల్లడించడం సాధ్యంకాదని ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. వాస్తవానికి ఎలాంటి రుజువులూ లేనప్పటికీ.. విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్నవారి పేర్లన్నింటినీ తమకు సమర్పించాలంటూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై మరికొంత వివరణ కోసం అఫిడవిట్‌లో ఈ మేరకు కొన్ని అంశాలను కేంద్రం పొందుపరిచింది.

నల్లధనం కేసుల విషయంలో పేర్లను గోప్యంగా ఉంచాలన్నది తమ అభిమతం కాదని.. పన్ను ఎగవేత ఆరోపణలకు రుజువులున్న కేసులన్నింటిలోనూ విదేశాలనుంచి వచ్చే సమాచారాన్నంతా బయటపెడతామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలియజేసింది. ఖాతాలున్న వారిపేర్లంటినీ వెల్లడిస్తే పన్ను ఒప్పందాలున్న దేశాలతో ఇబ్బందులు తలెత్తుతాయని కూడా పేర్కొంది. అయితే విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీయడంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని.. ఇందుకోసం చట్టపరంగా, దౌత్యపరంగా అన్ని అస్త్రాలనూ సంధిస్తామని,  సమాచారాన్ని రప్పించడంకోసం అన్ని దర్యాప్తు సంస్థలనూ ఉపయోగిస్తామని కూడా సుప్రీం కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందానికి(ఎస్‌ఐటీ)వెల్లడించింది.

పన్నులు ఎగవేసి విదేశాల్లో అక్రమంగా దాచుకున్న భారతీయుల నల్లధనం అంశాన్ని దర్యాప్తు చేయడం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ సిట్‌ను ఈ ఏడాది మే 26న నియమించించింది. ఇదిలాఉండగా... తమ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలు అందించేందుకు స్విస్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది.
 
18 మందిని బయటపెట్టిన యూపీఏ...

కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ సర్కారు అసలు ఈ నల్లకుబేరుల పేర్ల వెల్లడి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఐటీ శాఖ ప్రాసిక్యూషన్ మొదలుపెట్టిన వారికి సంబంధించి ఎల్‌ఎస్‌టీ బ్యాంకులో బ్లాక్ మనీ దాచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది పేర్లను సుప్రీం కోర్టుకు యూపీఏ ప్రభుత్వం తెలియజేసింది. మరో 8 కేసుల్లో ఎలాంటి ఆధారాలూ దొరకలేదని అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది.
 
టింబ్లో విరాళాలు బీజేపీకే ఎక్కువ

నల్లధనం పేర్లలో ఉన్న గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో.. భారతీయ జనతా పార్టీకే (బీజేపీ) అత్యధికంగా రాజకీయ సంబంధ విరాళాలు అందించింది.  2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో దాదాపు పది దఫాలు రూ.1,18,51,000 కోట్లను ఆ సంస్థ, దాని ప్రతినిధులు బీజేపీకి విరాళాలు అందించారు. ఇదే కాలంలో మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ(ఐఎన్‌సీ)కి సంస్థ నుంచి రూ.65 లక్షల విరాళాలు అందాయి.

ఖండించిన డాబర్...
నల్ల ధనం జాబితాలో తమ గ్రూపునకు చెందిన ప్రదీప్ బర్మన్ పేరు ఉన్నట్లు వెల్లడైన వెంటనే డాబర్ గ్రూపు దీన్ని ఖండించింది. ఆయన ప్రవాసీయుడి(ఎన్‌ఆర్‌ఐ)గా ఉన్నప్పుడు విదేశీ బ్యాంకులో ఈ ఖాతాను తెరిచారని.. చట్టపరంగా అన్ని లాంఛనాలూ పూర్తిచేసే అకౌంట్‌ను ప్రారంభించినట్లు గ్రూపు అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఒకప్పుడు హోల్‌టైమ్ డెరైక్టర్‌గా ఉన్న ప్రదీప్.. ప్రస్తుతం గ్రూపులో ఎలాంటి పదవులూ నిర్వర్తించడం లేదని కూడా చెప్పారు. స్వచ్ఛందగానే ఖాతా వివరాలను ఆదాయపు పన్ను విభాగానికి వెల్లడించారని.. అవసరమైన మేరకు తగిన పన్నులను కూడా చెల్లించినట్లు డాబర్ ఒక ప్రకటనలో పేర్కొంది.

విదేశాల్లో బ్యాంకు ఖాతాలున్నవారినందరినీ నల్లధనం జాబితాలో ఒకే గాటన కట్టడం దురదృష్టకరమని బర్మన్ కుటుంబం వ్యాఖ్యానించింది. విదేశీ బ్యాంకుల్లో ఖాతాలున్న వారివిషయంలో అక్రమం, సక్రమం అనే తేడాలేవీ లేకపోవడంపట్ల చింతిస్తున్నామని... బర్మన్ల కుటుంబం కార్పొరేట్ నైతిక నియమావళి పాటించే విషయంలో అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉందని కూడా డాబర్ గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు.
 
షాక్ తిన్నా: లోధియా
ఇక లోధియా కూడా తనకు స్విస్ బ్యాంకులో ఖాతా ఉందన్న ఆరోపణలను ఖండించారు. ఇప్పటికే తన ఆదాయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తున్నానని, పన్ను కూడా చెల్లిస్తున్నానన్నారు. ఇందులో దాచేందుకేమీలేదన్నారు. తనకు స్విస్ సహా ఏ విదేశీ బ్యాంకులోనూ అకౌంట్ లేదని.. అసలు ఈ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని కూడా లోధియా పేర్కొన్నారు. భవిష్యత్తు చర్యలపై విలేకులు అడిగిన ప్రశ్నలకు... ప్రభుత్వ సంస్థలు, చట్టపరమైన ప్రక్రియలన్నింటికీ తాను సహకరిస్తానని ఆయన చెప్పారు.
 
అఫిడవిట్‌ను పరిశీలించాకే: రాధా టింబ్లో
 కాగా, అఫిడవిట్‌లో తన పేరు చేర్చడంపై వ్యాఖ్యానించేందుకు రాధా టింబో నిరాకరించారు. దీనిపై స్పందించేందుకు ముందుగా అఫిడవిట్‌లోని అంశాలను అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
 
ఎప్పుడు ఏం జరిగింది...
1991 నవంబర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీసహా 14 మంది రాజకీయ నాయకుల పేర్లను  స్విస్ మ్యాగజీన్ ష్వీజర్ ఇల్లస్ట్రేట్ ప్రకటించింది. మాజీ ప్రధాని రాజీవ్ పేరుతో స్విస్ బ్యాంక్ ఖాతాలో 2.2 బిలియన్ డాలర్లను అక్రమంగా కలిగి ఉన్నట్లు పేర్కొంది.
 2011 ఫిబ్రవరి: బీజేపీ అధ్యక్షతన ఏర్పడ్డ ఎన్‌డీఏ ఒక పుస్తకాన్ని(బుక్‌లెట్) విడుదల చేసింది. దీనిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విదేశీ రహస్య బ్యాంకు ఖాతాలలో నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆరోపించింది.
 2011 జూన్: భారతీయులు విదేశాలలో దాచుకున్న నల్లధనం 89 బిలియన్ డాలర్లు ఉంటుందన్న అంచనాలను ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశ్నించారు. అయితే నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు తగిన చర్యలను చేపడతామని చెప్పారు. నల్లధన నివారణ తదితర అంశాలపై ఎంసీ జోషీ అధ్యక్షతన ఒక అత్యున్నత కమిటీ ఏర్పాటైంది.
 2011 నవంబర్: నల్లధనంపై ప్రపంచవ్యాప్త పోరుకు జీ20లో క్రియాశీల సభ్య దేశంగా కొనసాగేందుకు ఇండియా కట్టుబడింది.
 2013 నవంబర్: బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా నిలిచిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చేందుకు చట్టాన్ని చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
 2014 ఏప్రిల్: లీచ్‌టెన్‌స్టీన్ బ్యాంకులో కొంతమందికిగల ఖాతాలను సుప్రీం కోర్టుకి యూపీఏ ప్రభుత్వం నివేదించింది. వీటిని జర్మన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
 2014 మే: నల్లధనంపై రిటైర్డ్ జస్టిస్ ఎంబీ షా అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది.
 2014 అక్టోబర్: నల్లధనం కేసులో భాగంగా వ్యాపారవేత్తలు ప్రదీప్ బర్మన్, పంకజ్ లోధియాలతోపాటు, టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ డెరైక్టర్లు రాధా సతీష్ టింబ్లో, చేతన్ ఎస్.టింబ్లో, రోహన్ ఎస్.టింబ్లో, అన్నా సి.టింబ్లో, మాలికా ఆర్.టింబ్లో పేర్లను ఎన్‌డీఏ ప్రభుత్వం బయటపెట్టింది.
 
ఎవరి సంగతి ఏంటంటే...
ప్రదీప్ బర్మన్
డాబర్ చ్యవన్‌ప్రాశ్, డాబర్ ఆమ్ల కేశ వర్ధిని...ఇవి దేశంలోని ప్రతి ఇంట్లోనూ కన్పించే ఆయుర్వేద ఉత్పత్తులు. వీటిని తయారు చేసే సంస్థ పేరు డాబర్ ఇండియా. ఆయుర్వేద ఉత్పత్తులకు ఇంటిపేరుగా మారిన కలకత్తాకు చెందిన  డాబర్ సంస్థ పూర్వ డెరైక్టర్ ప్రదీప్ బర్మన్ పేరు నల్ల కుబేరుల జాబితాలో చోటు చేసుకోవడంతో కార్పొరేట్ రంగం దిగ్బ్రాంతికి లోనైంది. 2007 నుండి 2012 వరకు డాబర్ సంస్థకు డెరైక్టర్‌గా పనిచేసిన ప్రదీప్ కేంబ్రిడ్జిలోని ప్రతిష్టాత్మక మెసాచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో మెకానికల్ విద్యనభ్యసించారు.

1967లో  కుటుంబ వ్యాపారం డాబర్‌లోనే మేనేజ్‌మెంట్  ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత 1981లో విడోగమ్ అండ్ కెమికల్స్ సంస్థకు మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వీడోగమ్ సంస్థకు స్విట్జర్లాండ్‌లోని యూనిపెక్టెన్ ఏజీ, జ్యూరిచ్ సంస్థతో గోరు చిక్కుడు జిగురు(గువార్ గమ్) తయారీకి సాంకేతిక ఒప్పందాన్ని కుదర్చటంలో కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం గ్రామీణ మహిళలకు విద్యనందించే లక్ష్యంతో పనిచేస్తున్న సందేశ్ అనే ఎన్‌జీవోకు వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్నారు.
 
పంకజ్ లోధియా
గుజరాత్‌లోని రాజ్‌కోట్ కేంద్రంగా పనిచేసే శ్రీజీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు పంకజ్ లోఢియా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దేశంలోని అతి పెద్ద బులియన్ డీలర్లలో ఒకటిగా పేరుగాంచిన ఈ గ్రూప్ గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తోంది.  ఈ సంస్థకు అహ్మదాబాద్, న్యూఢిల్లీ, జైపూర్, రాయ్‌పూర్, ఇండోర్, బెంగుళూరులలో కూడా బ్రాంచ్‌లున్నాయి. 2008లో దేశంలో తొలిసారిగా బంగారం, వజ్రాభరణాల కోసం అత్యాధునిక, ఎలక్ట్రానిక్ ఆన్‌లైన్ ట్రేడింగ్ సిస్టమ్ ‘శ్రీజీ స్పాట్’ను ఈ సంస్థ ఏర్పాటుచేసింది.

బులియన్ వ్యాపారంలో ఉండే 2100 మంది  జువెల్లర్స్, బ్యాంకులు, ఇన్వెస్టర్లు,  డీలర్లకు ఈ సిస్టమ్ ద్వారా బులియన్ ధరలు ‘టూవే’ కొటేషన్స్ అందేవి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సంస్థకు క్లయంట్లు ఉన్నారు. శ్రీజీ గ్రూప్ ప్రధాన వ్యాపార మూలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఉన్నాయి. రాజ్‌కోట్‌లో ఆకాశహర్మ్యాలను నిర్మిం చిన ఖ్యాతి ఈ సంస్థదే. మరో అనుబంధ సంస్థ శ్రీజీ ఆర్నమెంట్స్ ‘తత్వా’ బ్రాండ్‌తో బంగారు ఆభరణాలు,రత్నాలు, వజ్రాల తయారీతో పాటు మార్కెటింగ్ కూడా చేస్తుంది.
 
రాధా టింబ్లో

గోవాకు చెందిన మైనింగ్ దిగ్గజం టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్ డెరై క్టర్లలో ఈమె ఒకరు. కేంద్రం ప్రకటించిన  నల్ల కుబేరుల జాబితాలో ఉన్నారు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఆమె రూ.20 కోట్ల ఆదాయపు పన్నుతో పాటు రూ.30.8 కోట్ల అడ్వాన్స్ పన్నును చెల్లించి వార్తల్లోకివచ్చారు.  గోవాలో ఒక అక్రమ గని లీజును రెన్యూవల్ చేయడం, దాన్ని రాధా టింబ్లోతో పాటు టింబ్లో లిమిటెడ్‌లకు తవ్వుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వివాదాస్పదంగా మారింది.

ఈ గని లీజు వ్యవహారంలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని గోవా మైనింగ్ స్కామ్‌పై సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ షా కమిషన్‌తో పాటు  సుప్రీం కోర్టు కేంద్ర సాధికార కమిటీ(సీఈసీ) నివేదికల్లో కూడా నిగ్గుతేలించి. ప్రస్తుతం సుప్రీం నల్లధనంపై నియమించిన సిట్‌కు జస్టిస్ ఎంబీ షా నేతృత్వం వహిస్తుండం కూడా విశేషం. టింబ్లో కంపెనీ నిర్వహణలో ఉన్న ఒక మైన్ విదేశీ వ్యక్తి(పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన మయవానీ) పేరుతో(పవర్ ఆఫ్ అటార్నీ) ఉందని.. ఇది మైనింగ్ చట్టాలను ఉల్లంఘించడమేనని సీఈసీ సుప్రీంకు ఇచ్చిన నివేదికలో చెప్పింది.

విచారణార్హమైన కేసుల్లోనే పేర్లు: జైట్లీ
పన్ను ఎగవేతలకు సంబంధించి విదేశాల్లో ఖాతాల విషయంలో చట్టపరంగా విచారణ జరిపేందుకు రుజువులున్న(ప్రాసిక్యూటబుల్) కేసుల్లోనే ఆయా వ్యక్తులు, సంస్థల పేర్లను బహిర్గతం చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నల్లకుబేరుల పేర్లన్నీ బయటపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement