13 ప్రభుత్వ బ్యాంకులకు రూ.23,000 కోట్లు
మూలధనాన్నిచ్చి వాటా పెంచుకున్న కేంద్ర ప్రభుత్వం
రుణవృద్ధికోసమే ఈ చర్యలు: ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకులకు తాజా మూలధనం అందించే దిశగా కేంద్రం మంగళవారం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) సహా 13 బ్యాంకులకు రూ.22,915 కోట్ల తాజా మూలధనాన్ని కేటాయించింది. రుణాల్లో వృద్ధి రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, దీన్ని పెంచాలన్న లక్ష్యంతోనే బ్యాంకులకు ఈ నిధులందించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతగా ఈ నిధులిస్తున్నామని, బ్యాంకింగ్ పనితీరు ప్రాతిపదికన మరిన్ని నిధులు సమకూర్చడం జరుగుతుందని ఒక ప్రకటనలో వివరించింది. తాజా మూలధన కల్పనతో బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరుగుతుంది. తాజా పరిణామంతో బ్యాంకుల షేర్లు 2 నుంచి 5 శాతం శ్రేణిలో లాభపడ్డాయి.
బడ్జెట్‌లో ప్రకటనలో భాగమే....
గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఫలితాల అనంతరం... మొండిబకాయిలు, ఇతర కేటాయింపులకు అనుగుణంగా ప్రతి బ్యాంకూ తనకు కావల్సిన తాజా మూలధనం వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పునర్వ్యస్థీకరణ కోసం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు నాలుగేళ్లలో రూ.70,000 కోట్ల పెట్టుబడుల్ని ప్రభుత్వం అందిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 25 వేల కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది మరో 25,000 కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో తాజాగా ప్రకటించింది మినహాయిస్తే, మరో మూడు వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇక రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కో ఏడాదికి రూ.10,000 కోట్లు చొప్పున నిధులు అందజేయాలన్నది ప్రణాళిక. అవసరమైతే మరిన్ని నిధులు కూడా అందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణంలో మొండిబకాయిల పరిమాణం 14% కాగా, ప్రైవేటు బ్యాంకుల్లో ఈ నిష్పత్తి 4.5%..
హర్షణీయం...: ఎస్‌బీఐ చీఫ్
‘ప్రభుత్వ తాజా నిర్ణయం హర్షణీయం. తగిన సమయంలో తీసుకున్న ఈ చర్యలు బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల మెరుగుకు, రుణ వృద్ధికి దోహదపడుతుంది’ అని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు.