పింఛన్లకు నగదు ఇవ్వలేం
చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు
సాక్షి, అమరావతి: వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రతీ నెలా ఇచ్చే సామాజిక పింఛన్ల సొమ్మును రాజకీయ లబ్ధికోసం ఇన్నాళ్లూ నగదు రూపంలో పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చిన్న నోట్ల కొరత నేపథ్యంలో చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం చిన్న నోట్లు తగినంతగా సరఫరా చేయనందున వచ్చే నెల 1వ తేదీన సామాజిక పింఛన్లను నగదు రూపంలో చెల్లించలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
సామాజిక పింఛన్ల కోసం పంపిణీ కేంద్రాలకు రావద్దని కూడా మంగళవారం జారీ చేసిన ప్రత్రికా ప్రకటనలో పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు పింఛన్‌గా వెయ్యి రూపాయలు, దివ్యాంగులకు 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంది. బ్యాంకు ఖాతాల్లో జమ చేసినప్పటికీ బ్యాంకుల్లో 500, 100 నోట్లు లేనందున, కేవలం రెండు వేల నోట్లే ఉన్నందున సామాజిక పింఛన్ దారులకు బ్యాంకుల నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు.