చరణ్‌సింగ్‌ ఓకే అంటే ఆనాడే...ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ | Charan Singh was not impressed | Sakshi
Sakshi News home page

చరణ్‌సింగ్‌ ఓకే అంటే ఆనాడే...ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ

Published Mon, Dec 10 2018 3:32 AM | Last Updated on Mon, Dec 10 2018 3:32 AM

Charan Singh was not impressed - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఓ బంగారం వంటి అవకాశాన్ని జారవిడుచుకుందని, 1970ల చివర్లో పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత పన్ను వ్యవస్థ రూపకల్పన ప్రతిపాదనను టీసీఎస్‌ తీసుకురాగా, నాటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్‌ తిరస్కరించినట్టు మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ శశాంక్‌ షా తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘ది టాటా గ్రూపు: ఫ్రమ్‌ టార్చ్‌ బేరర్స్‌ టు ట్రయల్‌బ్లేజర్స్‌’ పేరుతో షా రాసిన పుస్తకంలో ఈ వివరాలు పేర్కొన్నారు. ‘‘1969లో ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ అనంతరం బ్యాంకుల్లో వ్యాపారం తగ్గగా, భారత్‌లో కంప్యూటర్లు వద్దని నాటి ప్రభుత్వం భావించింది.

కంప్యూటరైజేషన్‌తో పెద్ద ఎత్తున ఉపాధి దెబ్బతింటుందని భావించడం జరిగింది’’ అని షా తెలిపారు. ఇప్పుడు విస్తృతంగా వినియోగిస్తున్న పాన్‌ వ్యవస్థను టీసీఎస్‌ 1977లో ఆదాయపన్ను శాఖ కోసం అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘ఇది మంచి ఫలితం రావడంతో ఆదాయపన్ను శాఖ కంప్యూటరీకరణ అవకాశం కూడా టీసీఎస్‌కు లభించింది. అయితే, అప్పటి ఆర్థిక మంత్రి చరణ్‌సింగ్‌ ఆర్థిక శాఖలో కంప్యూటరీకరణ అవసరం లేదని, ఇది ఉపాధిలేమికి దారితీస్తుందంటూ తిరస్కరించారు. ఒకవేళ నాడు అమలు చేసి ఉంటే, పూర్తి కంప్యూటర్‌ ఆధారిత పన్ను వ్యవస్థతో ఎన్నో దేశాల కంటే భారత్‌ ముందుండేది’’ అని షా అభిప్రాయం వ్యక్తం చేశారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement