ఆభరణాల కొనుగోలు విలువ రూ.2 లక్షలు మించితే పన్ను
న్యూఢిల్లీ: నగదుతో పెద్ద మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేసే వారు ఇకపై ఒక శాతం పన్ను భారం భరించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలకు మించిన లావాదేవీలకు నగదు రూపంలో చెల్లింపులు చేస్తే ఒక శాతం మూలం వద్ద పన్ను కోత (టీసీఎస్) విధిస్తారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం రూ.5 లక్షలకు మించి నగదు రూపంలో ఆభరణాల కొనుగోళ్లపై ఈ నిబంధన అమల్లో ఉంది.
రూ.3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ 2017–18 బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీన్ని ఉల్లంఘిస్తే అంతే మొత్తం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆభరణాలపై ఒక శాతం టీసీఎస్ విధింపునకు ఉన్న రూ.5 లక్షల పరిమితిని రూ.2 లక్షలకు తగ్గించాలని ఆర్థిక బిల్లు 2017 స్పష్టం చేసింది. ఈ మార్పు కారణంగా ఆభరణాలను కూడా సాధారణ వస్తువుల కిందే పరిగణిస్తారు.
దీంతో రూ.2 లక్షల విలువ దాటిన లావాదేవీపై ఒక శాతం టీసీఎస్ విధించడం జరుగుతుంది. ‘‘ఆదాయపన్ను చట్టం ప్రకారం రూ.2 లక్షలకు మించి విలువ చేసే వస్తు, సేవలపై ఒక శాతం టీసీఎస్ విధించాల్సి ఉంటుంది. వస్తువులు అంటే అర్థం ఆభరణాలు కూడా. దీంతో రూ.2 లక్షలకు మించిన ఆభరణాల నగదు కొనుగోళ్లకూ టీసీఎస్ వర్తిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగమే తాజా మార్పుల వెనుక ఉన్న కారణంగా ఆర్థిక బిల్లు స్పష్టం చేసింది.