హెచ్1బీ వీసాల సంక్షోభం:మరోసారి ఐటీ డీలా
ముంబై: హెచ్1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు పేల్చడంతో దేశీయ ఐటీ రంగాన్ని భారీగా తాకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై తాజా కొత్త బిల్లు ప్రతిపాదన నేపథ్యంలో ఐటీ కౌంటర్ మరోసారి డీలాపడింది. మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో మార్కెట్లో భారీ అమ్మకాలకుదిగారు. దీంతో ప్రధాన ఐటీ షేర్లు నష్టాలు చవి చూస్తున్నాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా, మైండ్ ట్రీ 2శాతం నష్టపోయాయి. విప్రో, టెక్ మహీంద్రా, కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. లాభాల డబుల్ సెంచరీ సాధించిన మార్కెట్లలో దాదాపు అన్ని సెక్టార్లలోను కొనుగోళ్ళ ధోరణి నెలకొనగా ఐటీ, ఫార్మాసెక్టార్‌లో సెల్లింగ్ ప్రెజర్ భారీగా కనిపిస్తోంది.
కాగా హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఆరు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) వెల్లడించింది. ఏప్రిల్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరానికి (అక్టోబర్ 1, 2017 నుంచి ప్రారంభం)గాను సాధారణ హెచ్1బీ వీసాల దరఖాస్తులను కూడా ఏప్రిల్ 3 నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది. ప్రత్యేక ఫీజుతో హెచ్–1బీ వీసాల ఆమోద ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే ప్రీమియం ప్రాసెసింగ్ పై తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.