
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలులో నిర్బంధంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం ఈ కేసులో ప్రభుత్వ అధికారులు, బ్యూరోక్రాట్లు ఎవరూ ఎందుకు అరెస్ట్ కాలేదని ప్రశ్నించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సంబంధిత ఫైళ్లను ప్రాసెస్ చేసి తనకు సిఫార్సు చేసిన డజను మంది అధికారులను అరెస్ట్ చేయనప్పుడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని తనను పలువురు ప్రశ్నిస్తున్నారని చిదంబరం ట్వీట్ చేశారు. తన తరపున ఈ ప్రశ్నలతో ప్రభుత్వాన్ని నిలదీయాలని కుటుంబ సభ్యులను కోరుతూ చిదంబరం ట్వీట్ చేశారు. ఈ కేసులో చివరి సంతకం మీరు చేయగా, మిగిలిన ప్రక్రియను నడిపించిన అధికారులను ఎందుకు విడిచిపెట్టారని అడిగే వారికి తన వద్ద సమాధానం లేదని చెప్పుకొచ్చారు. ఏ అధికారీ తప్పు చేయలేదు..ఎవరినీ అరెస్ట్ చేయాలని తాను కోరుకోవడం లేదని చిదంబరం మరో ట్వీట్ చేశారు. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సెప్టెంబర్ 6న అరెస్ట్ అయిన చిదంబరంను జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం తిహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment