భారత్ ఆర్థిక వ్యవస్థ చైనా జీడీపీని అధిగమించలేదు
చైనా అధికార పత్రిక విశ్లేషణ
బీజింగ్: భారత్ ఆర్థిక వ్యవస్థ చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని ఎంతమాత్రం అధిగమించలేదని ఆ దేశ అధికార ఆంగ్ల వార్తా దినపత్రిక గ్లోబల్ టైమ్స్ విశ్లేషించింది. ఒక ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నా... చైనా జీడీపీని మాత్రం అధిగమించలేదని ఒక ఆర్టికల్‌లో పేర్కొంది. అంచనాలు అవాస్తవ చిత్రాన్ని కళ్లముందు ఉంచుతున్నట్లు అభిప్రాయపడింది. అసలు చైనా జీడీపీకి ఎంతో దూరంలో భారత్ జీడీపీ ఉన్న విషయాన్ని పేర్కొంది. 2015లో చైనా జీడీపీ 10.42 ట్రిలియన్ డాలర్లు కాగా, భారత్‌కు సంబంధించి ఈ విలువ కేవలం 2.18 ట్రిలియన్ డాలర్లు ఉన్న విషయాన్ని ఆర్టికల్ ఉటంకించింది.
భవిష్యత్తులో చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొంత మందగిస్తే... మందగించవచ్చుకానీ, జీరో, క్షీణ స్థాయిలకు పడిపోయే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో భారత్ జీడీపీ చైనా జీడీపీని ఎలా అధిగమిస్తుందని ప్రశ్నించింది. ఐఎంఎఫ్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మన్ శాక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు భారత్ వృద్ధి అవకాశాలను గోరంతలు కొండంతలు చేసి చూపెడుతున్నా... అంతర్జాతీయ ఆర్థిక చిత్రపటంలో భారత్ కీలకపాత్ర ఇప్పటికీ పోషించడం లేదని అభిప్రాయపడింది. అంతర్గతంగా భారత్ ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోందని పేర్కొన్న పత్రిక, ఈ సందర్భంగా విద్యుత్, పట్టణ నీటి సరఫరా, రవాణా, ఇతర మౌలిక రంగ సమస్యలను ప్రస్తావించింది. భారత్ సగటు జీవిత కాలం, విద్య, విద్యుత్ వినియోగం, పేదరికం వంటి సామాజిక అంశాలు ఇప్పటికీ... చైనా 20వ శతాబ్దపు స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది.