గ్లాండ్ ఫార్మా డీల్‌కు బ్రేక్!
♦ అభ్యంతరం తెలిపిన కేబినెట్ కమిటీ
♦ నిలిచిపోయిన రూ.8,800 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్లాండ్ ఫార్మాలో మెజారిటీ వాటా కొనుగోలుకు ముందుకొచ్చిన చైనా ఫార్మా దిగ్గజం షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ గ్రూప్‌నకు చుక్కెదురైంది. గ్లాండ్ ఫార్మాలో 86 శాతం వాటాను రూ.8,800 కోట్లకు దక్కించుకునేందుకు షాంఘై ఫోసన్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమావేశమైన కేబినెట్ ఎకనమిక్ అఫైర్స్ కమిటీ ఈ డీల్‌పై పలు అభ్యంతరాలను లేవనెత్తింది.
గ్లాండ్ ఫార్మా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఇంజెక్టబుల్ సాంకేతిక పరిజ్ఞానం మరో దేశం చేతుల్లోకి వెళ్తోందని కేబినెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు షాంఘై ఫోసన్ డీల్‌కు ఏప్రిల్‌లో అంగీకారం తెలుపుతూ కేబినెట్ కమిటీ అనుమతి కోసం ప్రతిపాదించింది. కేబినెట్ కమిటీ మాత్రం అభ్యంతరాలు లేవనెత్తింది.
డీల్ కుదిరితే గ్లాండ్‌లో 100 శాతం వాటాను ఇతర షేర్‌హోల్డర్ల నుంచి దక్కించుకోవడానికి ఫోసన్‌కు వీలుకలుగుతుంది. అలాగే చైనా కంపెనీకి భారత్‌లో ఇదే అతిపెద్ద ఒప్పందం కానుంది. కాగా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని గ్లాండ్ ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ రవి పెన్మత్స ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రవి పెన్మత్స, అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ కంపెనీ కేకేఆర్‌కు గ్లాండ్‌లో 95 శాతం వాటా ఉంది.