చిన్న నగరాల్లోనూ సినీ పొలిస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సినిమా ప్రదర్శన సంస్థల్లో ఒకటైన సినీపొలిస్ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో బహుముఖంగా విస్తరించనుంది. 2017 నాటికి దక్షిణ భారత రాష్ట్రాల్లో 180 కొత్త స్క్రీన్లు (థియేటర్లు) ప్రారంభించనున్నట్లు సినీపొలిస్ ఇండియా ఎండీ జవీర్ సొటోమెయర్ తెలిపారు. శుక్రవారమిక్కడ రామచంద్ర సీసీఎల్ మాల్‌లో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రోజురోజుకూ మల్టీప్లెక్స్‌కు ఆదరణ మెట్రో నగరాలకే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తుందని అందుకే మధురై, హుబ్లి, కోయంబత్తూర్, వరంగల్ వంటి పట్టణాల్లోనూ సినీపొలిస్ మల్టీప్లెక్స్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం విజయవాడలోని పీవీపీ మాల్‌లో సినీపొలిస్‌కు 4 స్క్రీన్లున్నాయని.. ఇదే ప్రాంతంలో మరో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించడంతో పాటుగా విశాఖపట్నానికీ విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సినీపొలిస్‌కు ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో అత్యథికంగా సందర్శకుల సంఖ్యను నమోదు చేస్తున్న మొదటి పది మల్టీప్లెక్స్ థియేటర్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు.