
నవభారత్ పవర్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సంస్థ నవభారత్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రూ.186 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్(జప్తు) చేసింది. 2006 నుంచి 2009 మధ్య బొగ్గు బ్లాక్‌ల కోసం చేసిన దరఖాస్తుల్లో వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపిస్తూ.. సీబీఐ ఇప్పటికే ఈ కంపెనీ పేరును చార్జిషీట్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. బొగ్గు స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జూలైలో తొలిసారిగా నాగ్‌పూర్ కంపెనీకి చెందిన రూ.24.50 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది.
సీబీఐతో కలిసి దర్యాప్తు...: బొగ్గు బ్లాక్‌ల కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తులో భాగంగా నవభారత్‌కు కంపెనీ, డెరైక్టర్ల ఆర్థిక లావాదేవీలను రికార్డు చేశాకే అటాచ్‌మెంట్ ఆదేశాలను జారీచేసినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అక్రమ సొమ్ముగా తేల్చిన రూ.186.11 కోట్ల మొత్తాన్ని కంపెనీ డెరైక్టర్లు ఇతర కంపెనీల్లో తిరిగి పెట్టుబడులుగా పెట్టారని.. ముఖ్యంగా డెరైక్టర్ పి. త్రివిక్రమ ప్రసాద్ నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.147.99 కోట్ల విలువైన 73.99 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.
ఈ షేర్ల ప్రస్తుత అటాచ్‌మెంట్ విలువ రూ.138.59 కోట్లుగా పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన జోనల్ కార్యాలయం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇక నవభారత్ పవర్‌కు చెందిన మరో డెరైక్టర్ వై.హరీష్ చంద్ర ప్రసాద్ మహాలక్ష్మి విండ్‌పవర్ హైదరాబాద్ అనే సంస్థలో చేసిన రూ.45.19 కోట్ల పెట్టుబడులను(జప్తు విలువ రూ.36.32 కోట్లు) అటాచ్ చేసినట్లు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లాలోని రూ.11.20 కోట్ల విలువైన భూమిని కూడా సీజ్ చేసినట్లు కూడా పేర్కొంది. సీబీఐతో కలిసి ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.