సాక్షి, ముంబై : సౌమ్యుడు, అత్యంత సాధారణ జీవితాన్ని ఇష్టపడే వ్యాపారవేత్త కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజి సిద్ధార్థ అదృశ్యం వార్త వ్యాపారవర్గాల్లో కలవరాన్ని రేపింది. ప్రధానంగా కాఫీడే బోర్డుకు సిద్ధార్థ రాసినట్లుగా భావిస్తున్న లేఖ మీడియాలో వ్యాపించింది. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ను లాభదాయకంగా నిర్వహించడంలో విఫలమైనందుకు మనస్తాపంతోనే ఆయన ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఎంత కష‍్టపడినా, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ను విజయవంతం చేయడంలో విఫలమయ్యాననీ, వేధింపులను తట్టుకోలేకపోతున్నానంటూ లేఖ సాగడం గమనార్హం. తనపట్ల ఉంచిన నమ్మకానికి న్యాయం చేయలేక పోతున్నానని వాపోయారు. అయితే దీనికి పూర్తి బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. ఆస్తులతో పోలిస్తే అప్పులు చాలా తక్కువనీ మొత్తం అన్ని రుణాలనూ తీర్చేందుకు కంపెనీకి అవి సరిపోతాయని స్పష్టం చేశారు. ప్రధానంగా ప్రైవేట్ ఈక్వీటీ ఇన్వెస్టర్ల ఒత్తిడితోపాటు, ఆదాయ పన్ను ఉన్నతాధికారి వేధింపులను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
ముమ్మర గాలింపు
సోమవారం సాయంత్రం కర్ణాటక మంగళూరులోని నేత్రావతి నది వద్దగల బ్రిడ్జి నుంచి కారు దిగిన సిద్ధార్థ తదుపరి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా సిద్ధార్థ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నపాటిల్ అందించిన సమాచారం ప్రకారం సాయంత్రం ఎనిమిది గంటలకు బ్రిడ్జ్‌మీద దిగన సిద్ధార్థ, గంట తరువాత రమ్మని చెప్పారు. అనంతరం పాటిల్ అక్కడికి చేరుకొని ఆయనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సిద్ధార్థ కుమారుడికి సమాచారం అందించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, తదితర బృందాలు సిద్ధార్థ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. స్పెషల్ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపాయి. స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపును తీవ్రం చేశాయి.
ఇన్వెస్టర్ల అమ్మకాలు, షేరు డీలా
వీజీ సిద్దార్థ అదృశ్యమయ్యారన్నవార్తలు అటు ఇన్వెస్టర్లను కూడా షాక్‌కు గురి చేశాయి. దీంతో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. భారీ అమ్మకాలతో షేరు 20శాతం నష్టాలతో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అంటే అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు లేకపోవడంతో రూ. 153.40 వద్ద ఫ్రీజయ్యింది.
మైండ్ ట్రీ డీలే కొంపముంచిందా?
ఈ ఏడాది మార్చిలో టెక్ సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న 20 శాతం మొత్తం వాటాను రూ. 3300 కోట్లకు ఎల్ అండ్ టీకి విక్రయించి సిద్ధార్థ వార్తల్లో నిలిచారు. అలాగే 1993లో స్థాపించిన స్నాక్ ఫుడ్ కోలా జెయింట్ 1500 ఔట్‌లెట్లను విక్రయించడానికి కోకాకోలాతో చర్చలు జరిపినట్టు కూడా అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. సెప్టెంబర్ 2017లో ఆదాయపు పన్నుఅధికారులు దాడి చేయడం తెలిసిందే. అయితే మైండ్ ట్రీ డీలే కొంపముంచిందా. ఐటీ అధికారులు సీజ్ చేసిన షేర్లు సిద్ధార్థ అనూహ‍్య నిర్ణయానికి కారణమా లాంటి సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి.
కాగా దేశంలో అత్యధికంగా కాఫీ గింజలనుఎగుమతి చేసే వారిలోఆయన ఒకరు. 130 సంవత్సరాలకు పైగా సిద్ధార్థ కుటుంబం కాఫీ పండించే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌లో 32.75 శాతం వాటాను సిద్ధార్థ కలిగి ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సికల్ లాజిస్టిక్స్ ప్రమోటర్లలో ఒకరు. అలాగే కన్సల్టెన్సీ సంస్థ మైండ్‌ట్రీలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
మరోవైపు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. దీంతో రాష్ట్ర ముఖ‍్యమంత్రి యడ్యూరప్ప ఎస్‌ఎం కష్ణను కలిసి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment