కాఫీ డే ఐపీఓ ఇష్యూ ధర రూ.328
- రూ.1,150 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ తన ఐపీఓ ఇష్యూధరను రూ.328గా నిర్ణయించింది. గత శుక్రవారం(అక్టోబర్ 16న) ముగిసిన ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.316-328ని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని, రూ. 328 ఇష్యూధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.1,150 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది. ఈ ఇష్యూ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని, రూ.2,000 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయని పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో చర్చించి ఇష్యూ ధరను రూ.328గా నిర్ణయించామని వివరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ కానప్పటికీ, ప్రైస్‌బాండ్ గరిష్ట ధరను ఇష్యూధరగా కంపెనీ నిర్ణయించింది. 2012 డిసెంబర్‌లో వచ్చిన రూ.4,000 కోట్ల భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.