
శ్రీ సిటీలో కోల్గేట్ టూత్‌బ్రష్‌ల యూనిట్ ప్రారంభం
తడ: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడకు సమీపంలోని శ్రీసిటీలో బుధవారం కోల్గేట్ - పామోలివ్ కంపెనీ టూత్‌బ్రష్‌లు తయారుచేసే యూనిట్‌ను లాంచనంగా ప్రారంభించింది. ఆ సంస్థ దక్షిణ ఆసియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్సామ్ బచ్చాలాని సమక్షంలో రీజియన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఫెబియన్ టీ గార్సియా పరిశ్రమను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ భారత దేశంలో తొలి టూత్‌బ్రష్‌ల పరిశ్రమను శ్రీసిటీలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ పరిశ్రమ ద్వారా ఏటా 220 మిలియన్ల బ్రష్‌లను తయారు చేస్తారన్నారు. దీనిని త్వరలో 600 మిలియన్ బ్రష్‌లు ఉత్పత్తి చేసే విధంగా విస్తరణ జరుగుతుందన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య పాల్గొన్నారు.